
గణనాథుని కొలువు..‘కోరుట్ల’
కోరుట్ల: ఆధ్యాత్మికత, జీవకళ, వైవిధ్యం మేళవించిన కోరుట్ల గణనాథుల విగ్రహాలకు ఏటా ఎక్కడా లేని డిమాండ్. సుమారు 50 ఏళ్లుగా వినాయక విగ్రహాల తయారీకి పెట్టింది పేరుగా నిలుస్తోంది. పట్టణంలో ప్రస్తుతం 25 వరకు వినాయక విగ్రహా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సుమారు వెయ్యిమంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ తయారు చేసిన భారీ విగ్రహాల ధర రూ. 50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుందంటే ఆతిశయోక్తి కాదు. మండపాల నిర్వాహకులు వీటి కోసం వినాయక చవితి ఉత్సవాలకు ఆరునెలల ముందుగానే అడ్వాన్స్ చెల్లిస్తారు.
టర్నోవర్ సుమారు రూ.5 కోట్లు
కోరుట్లలోని గణనాథుల విగ్రహా తయారీ కేంద్రాల్లో ప్రతీ సీజన్‌లో సుమారు 3–4 వేల విగ్రహాల అమ్మకాలు సాగుతాయి. ఇక్కడి విగ్రహాలను కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల మండపాల నిర్వాహకులు కొనుగోలు చేస్తారు. ఏటా విగ్రహాల తయారీ కేంద్రాల టర్నోవర్ దాదాపు రూ.3–5 కోట్లు వరకు ఉంటుందని అంచనా.