
ట్రాక్టర్ కింద పడి యువకుడి దుర్మరణం
మెట్‌పల్లి రూరల్: ఇంటి నుంచి వెళ్లిన ఆ యువకుడు రాత్రివరకూ స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపాడు. ఓ స్నేహితుడు చాలారోజుల తర్వాత కలవడంతో అతడితోనే ఉండిపోయాడు. అంతలోనే ఇసుకకు గిరాకీ వచ్చిందని, త్వరగా రావాలని య జమాని ఫోన్ చేయడంతో అక్కడి నుంచి వెళ్లిన అతడిని ఆ దేవుడు తిరిగిరాని లోకానికి తీసుకెళ్లాడు. ఈ విషాద ఘటన మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆత్మనగర్‌కు చెందిన నర్ర శేఖర్(27) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి సమయంలో స్నేహితులతో చాలాసేపు గడిపాడు. ఇంతలో ఇసుక గిరాకీ రావడంతో ట్రాక్టర్‌లో ఇసుకను లోడ్ చేసుకుని డంప్ చేసేందుకు వెళ్తున్నాడు. వెల్లుల శివారు దొంగలమర్రి వద్దకు చేరుకోగానే అతడికి తరచూ ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న స్నేహితుడు దాండ్ల రవిని ట్రాక్టర్ నడపాలని సూచించాడు. ట్రాక్టర్ రన్నింగ్‌లో ఉండగానే శేఖర్ సీటు నుంచి లేచి ట్రాలీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడం... ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ ఉండడంతో.. పట్టుతప్పి టైర్ కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్ అ క్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. శేఖర్‌కు భార్య నాగలత, కూతురు ఉంది.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని..
శేఖర్ కుటుంబానికి ట్రాక్టర్ యజమాని న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు, బంధువులు మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు శనివారం భారీగా తరలివచ్చారు. ఆందోళనకు సిద్ధంకాగా పోలీసులు నచ్చచెప్పారు. తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తామని ఎస్సై కిరణ్‌కుమార్ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.
డ్రైవింగ్ చేస్తుండగా ఫోన్‌కాల్
పక్కనే ఉన్న స్నేహితుడికి స్టీరింగ్
సీటు మారుతుండగా కింద పడి మృతి