● ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలో 2వేల మంది పర్మినెంట్ ఉద్యోగులను నియమించాలని ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు, ఐఎన్‌టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్ జ్యోతికహాల్‌లో శనివారం ఎనిమిదో ఆల్ ఇండియా ఐఎన్‌టీయూసీ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ రెండు రోజుల సమావేశాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అడిషనల్ ఎన్‌బీసీ సభ్యుడు చంద్రవంశీ అధ్యక్షత వహించారు. బాబర్ సలీంపాషా మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టడం లేదన్నారు. వారిస్థానంలో కాంట్రాక్ట్ కార్మికులతో బాధ్యతా రహిత పనులు చేయిస్తున్నారనా ఆరోపించారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ఫ్యూయల్ గ్యాస్ డీ సల్ఫరైజేషన్(ఎఫ్‌జీడీ)లను ఏర్పాటు చేసేందుకు రూ.వందల కోట్లువెచ్చించి ఇటీవల కొత్త చిమ్నీలు నిర్మించారని, ఎఫ్‌జీడీలతో పనిలేదని కార్పోరేట్ అధికారులు పకటించడంతో సంస్థకు రూ. వందల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన స్పష్టం చేశారు. ఎఫ్‌జీడీలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఎన్టీపీసీల్లో 70 శాతం మంది ఉద్యోగులు ఐఎన్‌టీయూసీని గెలిపించుకుంటున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఐఎన్‌టీయూసీకి పట్టం కడుతున్నారని అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా బీఎంఎస్ మినహా జాతీయ కార్మిక సంఘాలు 13సార్లు సమ్మె చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని దుయ్యబట్టారు. రామగుండం ఎన్టీపీసీలో నాయకత్వం లేని బీఎంఎస్ గెలుపు కోసం ఆరాటపడుతోందని ఎద్దేవా చేశారు. ఎన్టీపీసీ ఉద్యోగులకు కేరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(సీడీపీ)లో శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతినిధులు ధర్మేంద్రప్రధాన్, సత్యనారాయణ సాహూ, వేముల కృష్ణయ్య, ఆరెపల్లి రాజేశ్వర్, కొలిపాక సుజాత, భూమల్ల చందర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీల ఐఎన్‌టీయూసీ ప్రతినిధులు హాజరయ్యారు.
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): అనారోగ్యం, అప్పుల బాధతో తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రానికి చెందిన ముద్రకోల లోకేశ్(26) కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో ర్యాపిడోలో పనిచేస్తుండేవాడు. అక్కడ అనారోగ్యం బారిన పడడంతో స్వగ్రామం వచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడు. కానీ ఆరోగ్యం కుదుటపడకపోగా అప్పులు పెరి గాయి. తీవ్ర మనస్థాపానికి గురైన లోకేశ్ శని వారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుడికి తండ్రి తిరుపతి, తల్లి సుశీల, చెల్లెలు కావ్య ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వెల్గటూర్: అనారోగ్యంతో వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎండపల్లి మండలం కొండాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇప్పల రాజయ్య కొంతకాలంగా హైబీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. శనివారం తన భార్యతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. పొలం పక్కన ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. రాజయ్య భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
ప్రైవేటు ఆస్పత్రిలో వ్యక్తి మృతి
● వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన
జగిత్యాల: జగిత్యాలలోని గొల్లపల్లిరోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమేనంటూ మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తిప్పయపల్లికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో ఈనెల 18న ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్యశ్రీ ఉండటంతో వైద్యులు ఆపరేషన్‌కు అప్రూవ్ ఇచ్చి శనివారం ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. అంతలోనే ఆయన చనిపోయాడు. ఇది ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమేనంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి సీఐ కరుణాకర్ చేరుకుని బంధువులకు నచ్చజెప్పడంతో శాంతించారు.
ఎన్టీపీసీలో కొత్త నియామకాలు చేపట్టాలి
ఎన్టీపీసీలో కొత్త నియామకాలు చేపట్టాలి