
మంత్రపురిలో 110 ఏళ్లుగా..
మంథని: మంథనికి చెందిన బ్రాహ్మణ సామాజికవర్గం వంటలు చేసేందుకు మధ్యభారత్‌లోని నాగ్‌పూర్ (ప్రస్తుత మహారాష్ట్ర) వెళ్లేవారు. అక్కడి సంప్రదాయాన్ని మంథనికి తీసుకొచ్చి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. బాలగంగాధర్ తిలక్ 1913లో ముంబైలో ప్రారంభించిన గణేశ్ ఉత్సవాల స్ఫూర్తితో మంథనిలో సర్వజన– గజానన మండలి ఏర్పాటు చేసి 1916 నుంచి వేడుకలు నిర్వహిస్తున్నారు.
నాగ్‌పూర్, మంథనిలోనే సిద్ధి, బుద్ధి..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్, మంథని మినహా దేశంలో ఎక్కడా సిద్ధి, బుద్ధి విగ్రహాలతో గణేశ్ దర్శనం లభించదు. నాడు నాగ్‌పూర్‌లో గణపతి విగ్రహాన్ని సేకరించి రైలులో బల్హార్ష వరకు వచ్చి, అక్కడి నుంచి విగ్రహానికి గుడ్డలు చుట్టి, ఎడ్లబండిలో మంథని గోదావరి తీరం వరకు తీసుకొచ్చి తర్వాత కాలిబాటన నిజాం పోలీసుల కంట పడకుండా రహస్యంగా మంథనికి చేర్చినట్లు అప్పటివారు చెప్పారని నిర్వాహకులు చెబుతారు. మంథని పెంజేరుకట్ట హనుమాన్ ఆలయంలో గణపతి ఉత్సవాలను 1916 నుంచి నిర్వహిస్తున్నారు. మోతారాం గారి రాజేశ్వర్‌రావు, టక్కేగారి మల్లన్న, మంథని లింగయ్య తదితరులు నాడు ఉత్సవాల నిర్వహణ చూసేవారు. అలాగే నడివీధిలో 1918 నుంచి, మందాట వీధిలో 65 ఏళ్లుగా వేడుకలు నిర్వహిస్తున్నారు. రావుల చెరువుకట్టతో పాటు మంథనిలోని ఆయా వార్డుల్లోనూ 50 ఏళ్లుగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు.