ఆత్మనిర్భర్ పథకం కోసం ఎదురుచూపులు
నిలిచిపోయిన నాలుగో విడత రుణాలు
ఆందోళనలో వీధి వ్యాపారులు
క్రెడిట్ కార్డులు ఇచ్చే యోచనలో అధికారులు
జగిత్యాల: మున్సిపాలిటీల పరిధిలో ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారం చేసుకునేవారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. చిరువ్యాపారులకు ఈ పథకం వరంగా మారింది. తొలి విడతలో రూ.10వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50వేల వరకు రుణాలు అందజేసింది. మొదటి విడత రుణం చెల్లించినవారికి రెండో విడతలో, మూడో విడతలో రుణాలు అందించారు. నాలుగో విడతకు వచ్చేసరికి ఆత్మ నిర్భర్ నిధి పథకాన్ని సర్కారు నిలిపివేసింది. వెబ్‌సైట్‌ను సైతం మూసివేసింది. దీంతో రుణాలు వస్తాయో లేదో అన్న ఆందోళనలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన చిరువ్యాపారులున్నారు.
కరోనా సమయంలో ఆదుకున్న పథకం
కరోనా సమయంలో చిరువ్యాపారులకు కోలుకో లేని దెబ్బ తగిలింది. వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ పథకాన్ని మున్సిపాలిటీల్లో అమలు చేశారు. మొదట రూ.10వేలు రుణంగా అందించారు. రుణం పొందిన వ్యాపారి సక్రమంగా కిస్తీలు చెల్లిస్తే రెండో విడతలో రూ.20 వేలు, మళ్లీ సక్రమంగా చెల్లిస్తే మూడో విడతలో రూ.50 వేలు రుణం అందించడం జరిగింది. ప్రస్తుతం ఈ పథకం ప్రారంభమై ఐదేళ్లు పూర్తి కావడంతో రుణాల మంజూరును తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
రుణభారం తగ్గింపు
ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రుణాలు అందించడంతో వడ్డీ భారం చిరువ్యాపారులకు ఎంతో తగ్గింది. సకాలంలో కిస్తీలు చెల్లించడంతో బ్యాంకులు సైతం రుణాలు ఎప్పటికప్పుడు అందజేయడంతో వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థిక సాధికారత సాధించారు. నాలుగో విడతలో రుణాలు ఇస్తారనుకున్నప్పటికీ సైట్ మూసివేయడంతో ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో జగిత్యాలతో పాటు, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలున్నాయి. 15,307 మంది వీధి వ్యాపారులుండగా, 1,036 మంది రుణాలు అందుకున్నారు. ప్రస్తుతం పథకం ఆగిపోవడంతో రుణాలు మళ్లీ వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
క్రెడిట్‌కార్డులు ఇచ్చే యోచన
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న వీధి వ్యాపారులకు నాలుగో విడతలో ఆత్మ నిర్భర్ పథకం కింద క్రెడిట్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని మెప్మా అధికారులు తెలిపారు. రుణంగా అయినా ఇవ్వొచ్చు లేదా క్రెడిట్ కార్డులైనా ఇవ్వవచ్చని తెలిపారు. రూ. లక్ష వరకు లిమిట్‌తో ఇచ్చే ఈ క్రెడిట్‌కార్డులను చిరువ్యాపారులు వినియోగించుకోవచ్చునని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రాలేదని మెప్మా అధికారులు తెలిపారు.


