కేసీఆర్.. నోరు అదుపులో పెట్టుకో..
పంచాయతీల ఓటమి జీర్ణించుకోలేక ప్రగల్బాలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సీఎం రేవంత్‌రెడ్డిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మార్పును కోరిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని, జూబ్లీహిల్స్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పును జీర్ణించుకోలేక.. బీఆర్‌ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనే భయంతో కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లపాటు ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని కేసీఆర్ ఇప్పుడు పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని భావించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారని తెలిపారు. గత పాలనలో రాష్ట్ర బడ్జెట్‌ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. సీఎంపై వ్యక్తిగతంగా మాట్లాడటం సరికా దని, ఎవరి దయదాక్షిణ్యాలతోనో కుర్చీలో కూర్చోలేదని పేర్కొన్నారు. బయట విమర్శలు చేయడం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సూచించారు. కేటీఆర్‌కు అహంకారం ఎక్కువగా ఉందని, హరీశ్‌రావు బాధ్యతలేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బుద్ది తెచ్చుకొని ప్రజలు ఆమోదించే పనులు చేయాలని హితవుపలికారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు.


