పర్యాటక అందాలను వెలుగులోకి తెండి
జగిత్యాలటౌన్: జిల్లాలో ఇప్పటివరకు వెలుగుచూడని పర్యాటక అందాలను వెలుగులోకి తెచ్చేలా ఫొటోలు, వీడియోలను వందపదాలకు మించకుండా తయారు చేసి గూగుల్‌ఫాం లేదా సోషల్ మీడియాలో పొందుపరచాలని కలెక్టర్ సత్యప్రసాద్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు వెలుగులోకి రాని పర్యాటక అందాలను ఆవిష్కరించేందుకు 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. యువత ఫొటో, వీడియోగ్రాఫర్స్, కవులు, రచయితలు పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజలకు పెద్దగా తెలియని జలపాతాలు, పురాతన ఆలయాలు, ట్రెక్కింగ్ పాయింట్లు వంటి వంద కొత్త గమ్యస్థానాలను గుర్తించి వాటి వివరాలతో కాపీ టేబుల్ బుక్ రూపొందించడమే పోటీల లక్ష్యమన్నారు. ప్రకృతి, వైల్డ్‌లైఫ్, ఆర్ట్‌అండ్‌కల్చర్, హెరిటేజ్, వాటర్ బాడీస్, వంటకాలు, ఫాంస్టెస్, రిసార్ట్, స్పిర్చువల్, అడ్వెంచర్ వంటి పది విభాగాల్లో www.ot ur-ir-m.te a nfa na,gov.i nMకు తమ ఎంట్రీలు పంపాలన్నారు. తాము ఎంచుకున్న విభాగానికి సంబంధించి మూడు మంచి ఫొటోలు, 60 సెకండ్ల వీడియో, ఆ ప్రదేశానికి వెళ్లి వచ్చేందుకు రవాణా, బసకు సంబంధించి బడ్జెట్ వివరాలతో కూడిన సమాచారాన్ని తయారు చేసి వెబ్‌సైట్లో పొందుపరచాలన్నారు. ఉత్తమ ఎంట్రీలకు మొదటి బహుమతి రూ.50వేలు, రెండో బహుమతి రూ.30వేలు, మూడో బహుమతి రూ.20వేలతోపాటు కన్సోలేషన్ బహుమతులుగా హరిత హోటల్‌లో ఉచిత బస కల్పిస్తారని తెలిపారు. సంక్రాంతికి విజేతలను ప్రకటిస్తారని తెలిపారు. ఆసక్తి గలవారు జనవరి 6లోపు ఎంట్రీలు పంపాలని సూచించారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, ట్రైనీ డిప్యుటీ కలెక్టర్ హారిణి, యువజన, క్రీడల అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


