
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
● డీఆర్డీఏ పీడీ రఘువరణ్
జగిత్యాల: మహిళా సంఘాల సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్, యూనియన్ బ్యాంక్ అధికారి అరుణ సవిత అన్నారు. పట్టణ, గ్రామీణ మహిళా సంఘాల సభ్యులకు కలెక్టరేట్‌లో మంగళవారం రూ.25 కోట్ల చెక్కులు అందించారు. మహిళా సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో ముందంజలో ఉంటాయని, ఆర్థికంగా ఎదిగి వారి కుటుంబాలు ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలన్నారు. రుణాలు పొందిన మహిళలు సకాలంలో చెల్లించి వ్యాపారాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు. నారీశక్తి కార్యక్రమం కింద వ్యక్తిగత రుణాలు కూడా పొందాలన్నారు. తక్కువ సమయంలోనే రూ.25 కోట్ల రుణాలు మంజూరు చేసిన యూనియన్ బ్యాంక్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ చరణ్‌దాస్, మెప్మా ఏవో శ్రీనివాస్, రాంకుమార్, మాణిక్యరెడ్డి, సునీత పాల్గొన్నారు.