నాణ్యమైన విద్య అందించాలి
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్లః ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో ఇంటర్ ఫలితాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీలవ ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం ఐదు శాతం ఉత్తీర్ణతపై అసహనం వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి నారాయణ, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.
గ్రామాల్లోకెళ్లి ప్రజల కష్టాలు తీర్చండి
మల్లాపూర్: ప్రత్యేకాధికారులతో పాటు గ్రామస్థాయి అధికారులందరూ గ్రామాల్లోకి వెళ్లి ప్రజల కష్టాలు తీర్చాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకాధికారులు ఆయా గ్రామాలకు వెళ్లడం లేదని, కొంతమంది పంచాయతీ కార్యదర్శులు ప్రజాసమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి, తహసీల్దార్ వీర్‌సింగ్, పీఆర్ డీఈ వెంకటరమణరెడ్డి, ఏవో లావణ్య, పలుశాఖల ఏఈలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


