అవకతవకలకు తావు లేకుండా ధాన్యం కొనాలి
మెట్‌పల్లిరూరల్: అవకతవకలకు తావు లేకుండా ధాన్యం కొనాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌లోని కొనుగోలు కేంద్రాన్ని శనివారం సందర్శించారు. కొనుగోళ్లపై ఆరా తీశారు. సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని, 24గంటల్లోపు కేటాయించిన రైస్‌మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోళ్ల వివరాలు, లారీ ట్రక్‌షీట్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. రికార్డుల నిర్వహణ సరిగ్గా ఉండాలన్నారు. కేంద్రాల్లో ప్యాడీక్లీనర్‌లు ఉంచాలని, రైతులకు అసౌకర్యం కలగకుండా తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉంటున్నందున హమాలీలు ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే పనులు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రాజ్‌మహ్మద్, ఆర్‌ఐ ఉమేశ్, ఏఈవో మనోజ్ఞ పాల్గొన్నారు.
ఎస్‌బీ డీఎస్పీగా వెంకటరమణ
జగిత్యాలక్రైం: స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పల్లె వెంకటరమణను నియమిస్తూ శనివారం రాత్రి డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న వెంకటరమణను ఖాళీగా ఉన్న జిల్లా ఎస్‌బీ డీఎస్పీగా నియమించారు.
మండుతున్న ఎండలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో నాలుగైదు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. జిల్లాలో శనివారం పగటి ఉష్ణోగ్రతలు 45.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. రాత్రి సమయంలో కనిష్టంగా 26.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. రాయికల్ మండలం అల్లీపూర్‌లో 45.3 డిగ్రీల సెల్సియస్, రాయికల్‌లో 45.2, మల్లాపూర్‌లో 45.1, కోరుట్లలో 45 డిగ్రీలుగా నమోదయ్యాయి. గొల్లపల్లి, మన్నెగూడెంలో 44.8, జైన, అయిలాపూర్‌లో 44.7, మెట్‌పల్లిలో 44.6, మేడిపల్లి, పెగడపల్లి, నేరేళ్లలో 44.5, గోదూర్‌లో 44.4, సారంగాపూర్, కథలాపూర్, వెల్గటూర్‌లో 44.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
అవకతవకలకు తావు లేకుండా ధాన్యం కొనాలి


