భూ భారతితో రైతులకు మేలు
● త్వరితగతిన సమస్యలు పరిష్కారం ● కొత్త చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు ● కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల ఆధ్వర్యంలో నిర్వహణ ● ‘సాక్షి’తో కలెక్టర్ సత్యప్రసాద్
సాక్షి: భూభారతి చట్టంతో ఎలాంటి ఉపయోగాలున్నాయి?
కలెక్టర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ చట్టం త్వరలో అమల్లోకి రాబోతోంది. ఇందులో ధరణిలో లేని పలు అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. వీటివల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుంది.
సాక్షి: జిల్లా రైతులు వివిధ భూ సమస్యలపై ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఏమైనా పరిష్కారమవుతున్నాయా?
కలెక్టర్: భూ సమస్యల పరిష్కారంలో జగిత్యాల జిల్లా ముందంజలోనే ఉంది. ధరణిలో వచ్చిన దాదాపు సమస్యలన్నీ పూర్తయ్యాయి. భూభారతి అమల్లోకి వచ్చేలోపు ధరణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
సాక్షి: భూ హక్కుల రికార్డుల తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చా?
కలెక్టర్: భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు నూతన చట్టం వచ్చిన ఏడాదిలోపే దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆర్డీవో, తహసీల్దార్లు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
సాక్షి: భూభారతి చట్టంపై రైతులకు ఎలా అవగాహన కల్పిస్తున్నారు?
కలెక్టర్: భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చట్టం గురించి వివరిస్తున్నాం. ఈనెల 30వరకు ప్రతి మండలంలో ఈ చట్టంపై వివరిస్తున్నాం. రైతులకు అనుమానాన్ని నివృత్తి చేస్తున్నాం.
సాక్షి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 8వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త చట్టంలో వాటిని పరిష్కరించే అవకాశం ఉందా?
కలెక్టర్: కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తులు చేసుకుంటున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆర్డీవో స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
సాక్షి: ధరణి ఉన్నప్పుడు ఏదైనా సమస్య ఉంటే ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం లేదు. ఇప్పుడు ఈ చట్టంలో అవకాశం ఉందా?
కలెక్టర్: కొత్త చట్టం ప్రకారం భూ హక్కుల నిరూపణకు అవసరమైన పత్రాలు జతచేస్తే ఆర్డీవో స్థాయిలో విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులూ లేవు.
సాక్షి: ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. వాటికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
కలెక్టర్: ఆబాది, గ్రామకంఠం వంటి భూములకు గుర్తింపు సంఖ్య ఉంటుంది. కబ్జాకు గురికాకుండా చూస్తాం. ఆధార్ కార్డు లాగే భూధార్ సంఖ్య కూడా ఇస్తాం.
సాక్షి: వారసత్వ భూములకు మ్యుటేషన్ ఎలా?
కలెక్టర్: వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ స్థాయిలో విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు. ఈ చట్టం ద్వారా నిర్ణీత వ్యవధిలో కాకపోతే ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ అయిపోతుంది. ఈ చట్టంలో చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి.
సాక్షి: జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. వాటిని ఎలా పరిష్కరించే అవకాశాలున్నాయి?
కలెక్టర్: రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా దరఖాస్తు చేసుకుంటే ఆర్డీవో, తహసీల్దార్, కలెక్టర్ స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో ఈ అవకాశం లేదు.
సాక్షి: చాలామంది రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దరఖాస్తులు చేసుకున్నా రాలేదు. ఈ చట్టంలో వచ్చే అవకాశాలున్నాయా..?
కలెక్టర్: పట్టాదారు పాస్‌బుక్‌ల కోసం దరఖాస్తులు చేసుకుంటే విచారణ చేపట్టి పాస్‌బుక్ జారీ చేస్తాం. రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన అనంతరం అన్ని సక్రమంగా ఉంటే బుక్ తొందరగానే వస్తుంది.
జగిత్యాల: ‘ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్) చట్టంతో రైతులకు మేలు జరుగుతుంది. ధరణి పోర్టల్‌లో లేని పరిష్కార మార్గాలు కొత్తచట్టంలో పొందుపర్చారు. ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే వీలుంది. గతంలో మాదిరిగా సీసీఎల్‌కు వెళ్లకుండా జిల్లాస్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంది. రైతులకు భూభారతి చట్టంపై వివరించేందుకు ఈనెల 17 నుంచి 29వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం..’ అని కలెక్టర్ సత్యప్రసాద్ వివరించారు. భూభారతి చట్టంపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
భూ భారతితో రైతులకు మేలు


