ఆరోగ్య మందిర్ సేవలు భేష్
సారంగాపూర్: బీర్‌పూర్ మండలంలోని బీర్‌పూర్, నర్సింహులపల్లె ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖానా)ల్లో అందుతున్న సేవలపై శుక్రవారం జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం ఆన్‌లైన్‌లో పరిశీలన చేసింది. ఆన్‌లైన్ తనిఖీలో పాల్గొన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్‌తో జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం సభ్యులు డాక్టర్ అజయ్‌కుమార్, డాక్టర్ నిరుపజాలు ఆరోగ్య మందిర్‌ల సేవలపై పలు ప్రశ్నలు అడిగారు. ఈరెండు ఆరోగ్య మందిర్‌లలో 15మంది సిబ్బంది పనిచేస్తున్నారని, 10 రోజులకోసారి జిల్లాస్థాయి వైద్యాధికారులు ఆస్పత్రిలో అందుతున్న సేవలపై పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. 154 రకాల మందులు అందుబాటులో ఉంచామని తెలపడంతో బృందం సభ్యులు అభినందించారు. రోజూ వస్తున్న రోగుల సంఖ్య, ఆస్పత్రిలో రికార్డుల నిర్వహణ తీరును వివరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల ద్వారా జాతీయస్థాయిలో ప్రతీచోట నాణ్యమైన వైద్యసేవలు, మందులు అందించి ప్రజల ఆరో గ్య ప్రమాణాలను మెరుగుపర్చే కార్యక్రమం అని తెలిపారు. ఆరోగ్యమందిర్‌లో పనితీరు ఇలాగే కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌తో పాటు మండల వైద్యాధికారిణి రాధ, డాక్టర్ నరేష్, డీపీవో రవీందర్, సీహెచ్‌వో కుద్ధూస్, సూపర్‌వైజర్లు కిశోర్, తార, ఏఎన్‌ఎం, ఆశాలు పాల్గొన్నారు.


