● పంటల పరిశీలనలో ప్రభుత్వ విప్
ధర్మపురి/బుగ్గారం: అకాలవర్షంతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. అకాలవర్షంతో పంటలు నష్టపోయిన రైతుల పొలాలను ఆదివారం రైతులతో కలిసి సందర్శించారు. మండలంలోని రాయపట్నంలో మొక్కజొన్న, వరిపొలాలను పరిశీలించారు. చేతికందిన పంట ఇలా నేలపాలు కావడం బాధాకరమన్నారు. పంటల నష్టం విలువను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. గ్రామంలో 1480 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. బుగ్గారంలో వివిధ రైతుల పంట పొలాలను ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల సుభాష్, కార్యకర్తలు పాల్గొన్నారు.