● నేలవాలిన మామిడి, వరి, మొక్కజొన్న పంటలు ● ప్రాథమిక నివేదిక రూపొందిస్తున్న అధికారులు
జగిత్యాలఅగ్రికల్చర్/జగిత్యాలరూరల్/గొల్లపల్లి/వెల్గటూర్/ధర్మపురి: జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో రైతన్న భారీగా నష్టపోయాడు. ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో పంటలు నేలవాలాయి. మామిడి, నువ్వు, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వ్యవసాయ, ఉద్యాన పంటలు సుమారు 5,532 ఎకరాల్లో నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా నివేదిక రూపొందించారు. కలెక్టర్ సత్యప్రసాద్ వెల్గటూర్, ధర్మపురి మండలాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు. జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ జగిత్యాల రూరల్, ధర్మపురి, జిల్లా ఉద్యానశాఖాధికారి శ్యాం ప్రసాద్ కొడిమ్యాల, మల్యాల మండలాల్లో పర్యటించారు. 33 శాతానికి మించి నష్టపోయిన పంటలను అంచనా వేశారు. ధర్మపురిలో 1495 ఎకరాలు, సారంగాపూర్‌లో 18, పెగడపల్లిలో 100, బుగ్గారంలో 257, ఎండపల్లిలో 123, మేడిపల్లిలో 5, వెల్గటూర్‌లో 270, బీర్‌పూర్‌లో 8, జగిత్యాల రూరల్ మండలంలో 735, గొల్లపల్లిలో 365 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉద్యానశాఖ అధికారులు అయా మండలాల్లో పర్యటించి దాదాపు 549 రైతులకు చెందిన 2156 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదిక రూపొందించారు.
33శాతం నిబంధన రైతులకు శాపం
పంట నష్టం 33 శాతానికి మించి జరిగితేనే అధికారులు నివేదికలు తయారు చేయడం రైతులకు శాపంగా మారింది. వారంలో కోతకు వచ్చే పంటలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత జగిత్యాల రూరల్ మండలం హైదర్‌పల్లి, సారంగాపూర్ మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించా రు. ఎకరాకు రూ.50వేల చొప్పున పరిహా రం అందించాలని డిమాండ్ చేసారు.
పెగడపల్లిలో 47.3 మి.మీ వర్షపాతం
పెగడపల్లి మండలంలో అత్యధికంగా 47.3 మి.మీ వర్షపాతం నమోదైంది. బుగ్గారం మండలం సిరికొండలో 39.3 మి.మీ, ఎండపల్లి మండలం గుల్లకోటలో 38.3 మి.మీ, జగిత్యాల రూరల్ మండలం పొలాసలో 35 మి.మీ, గొల్లపల్లిలో 33.3 మి.మీ, ధర్మపురి మండలం నేరేళ్లలో 32.8 మి.మీ, జైనాలో 25.3 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మరో రెండు మూడు రోజులు కూడా మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని రాంనూర్‌లో అకాలవర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్డీవో మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి రాంచందర్, మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ పాల్గొన్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది గొల్లపల్లి మండలం భీంరాజ్‌పల్లి గ్రామానికి చెందిన రైతు సింగారపు మల్లేశం. తనకున్న భూమిలో ఆరుతడి పంటగా మొక్కజొన్న సాగు చేశాడు. ప్రస్తుతం పంట చేతికొచ్చే దశలో ఉంది. శనివారం వేకువజాము వరకు కురిసిన అకాల వర్షానికి పంటంతా నేలకొరింది. ఈదురుగాలులకు ధాన్యం కూడా రాలిపోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు ఈ రైతు.
అకాలవర్షం.. భారీగా పంట నష్టం
అకాలవర్షం.. భారీగా పంట నష్టం
అకాలవర్షం.. భారీగా పంట నష్టం
అకాలవర్షం.. భారీగా పంట నష్టం