
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ●
జగిత్యాలక్రైం: తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని దొంగలు బంగారం, నగదు ఎత్తుకెళ్తున్నారు. పగలు సమయంలో రెక్కీ నిర్వహించి రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్నారు. జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
భయం భయం
జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి పనిపై తాళం వేసి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. నిత్యం తాళం వేసిన ఇళ్లలోనే చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు.
సీసీ కెమెరాలున్నా..
నేరాల నియంత్రణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేను సైతం కార్యక్రమం ద్వారా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా చోరీలు తగ్గడం లేదు. నిరంతర నిఘా కోసం పోలీసు శాఖ బ్లూకోల్ట్స్ బృందాలను ఏర్పాటు చేసినా దొంగతనాలు ఆగడం లేదు.
రాత్రివేళల్లోనే..
జిల్లావ్యాప్తంగా దొంగతనాలు రాత్రివేళల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మంది ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని చెప్పినా.. విలువైన వస్తువులను ఇళ్లలో పెట్టుకోవద్దని సూచించినా అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు.
పాతనేరస్తులపై నిఘా
జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పాత నేరస్తులపై పోలీసులు నిఘా పెట్టారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. చోరీలకు పాల్పడి, జైలు జీవితం గడిపివచ్చినవారు ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారు. ఏం పనిలో ఉన్నారని విచారణ చేస్తున్నారు.
పోలీసులకు చిక్కకుండా..
ఇటీవల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను బుగ్గారం పోలీసులు గుర్తించి వారి ఫొటోలను కూడా బహిర్గతం చేశారు. కానీ దొంగలు మాత్రం పోలీసులకు దొరకడం లేదు. పోలీసుల కళ్లుగప్పి వరుస దొంగతనాలు చేస్తుండటం జిల్లాలో కలకలం రేపుతోంది.
నిఘా పటిష్టం చేశాం
పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇంటికి తాళాలు వేసి వెళ్లేటప్పుడు పోలీసులతో పాటు స్థానికంగా ఉండే వారికి సమాచారం ఇవ్వాలి. తాళాలు వేసి ఉన్న ఇంటి ప్రాంతాల్లో నిఘా పెంచుతాం. అలాగే ప్రజలు ఇళ్లలో విలువైన వస్తువులుంచి తాళాలు వేసి బయటకు వెళ్లవద్దు. చాలా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
– సన్‌ప్రీత్‌సింగ్, ఎస్పీ

● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ●

● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ●

● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ●