
హైదరపల్లిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వృద్ధురాలు
జగిత్యాల: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు హోం ఓటింగ్ నిర్వహించాలని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. శుక్రవారం జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో హోం ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు. జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో 12డీ ఫాంల ద్వారా 1,141 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, శుక్ర, శనివారాల్లో అర్హులు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటింగ్ సరళిని పరిశీలించి పలు సూచనలు చేశారు.
తొలిరోజు 975 మంది ఓటింగ్
80 ఏళ్లకు మించిన వయోవృద్ధులు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగుల కోసం ఎన్నికల కమిషన్ హోం ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీంతో కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో 1,247 మంది ఉండగా తొలిరోజు శుక్రవారం 975 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 70 బృందాలు నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓట్లను స్వీకరించాయి.
ఇంటి వద్దే ఓటేసిన వృద్ధులు
జగిత్యాలరూరల్: 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఎన్నికల కమిషన్ ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో శుక్రవారం ఎన్నికల అధికారులు జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, హన్మాజీపేట, కన్నాపూర్, హైదర్‌పల్లి గ్రామాల్లో ఇంటి వద్దకు వెళ్లి వృద్ధులకు ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించారు. హైదర్‌పల్లికి చెందిన 92 ఏళ్ల వృద్ధుడు ఆకుల గంగారాం, 90 ఏళ్ల వృద్ధురాలు లైశెట్టి లచ్చవ్వ తమ ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కలెక్టర్ యాస్మిన్ బాషా

హోం ఓటింగ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్