ప్రారంభానికి సదర్‌మాట్ సిద్ధం
● గోదావరి నదిపై నిర్మాణం ● 676.50 కోట్లతో పనులు ● 18వేల ఎకరాలకు సాగునీరు ● త్వరలో సీఎం చేతులమీదుగా ప్రారంభం?
ప్రాజెక్టు వివరాలు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్.. నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామాన్ని కలుపుతూ గోదావరిపై నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజీ కమ్ బ్రిడ్జి పూర్తయ్యింది. 2016లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.676.50 కోట్లతో శ్రీకారం చుట్టింది. 1.58 టీఎంసీల నీటి సామర్థ్యంతో జగిత్యాల, నిర్మల్ జిల్లాలోని 18వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలన్నది లక్ష్యం. ప్రాజెక్టు పనులకు 2017లో అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులను దక్కించుకున్న రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ముందుగా పనులు నత్తనడకన చేసినప్పటికీ.. తర్వాత వేగవంతం చేశారు. మొత్తంగా తొమ్మిదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేశారు.
ప్రాజెక్టుతో లాభాలు
గోదావరిపై జగిత్యాల, నిర్మల్ జిల్లాల సరిహద్దున 55 గేట్లతో ఈ సదర్‌మాట్ ప్రాజెక్టు కమ్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు జిల్లాలోని సుమారు 18వేల ఎకరాలకు సాగునీరందనుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లోని 13 వేల ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని గంగనాల ప్రాజెక్టు ద్వారా 5వేల ఎకరాలకు నీరు అందించనున్నారు. అలాగే నిర్మల్ జిల్లాలోని వివిధ గ్రామాలకు వెళ్లేందుకు దూరభారం తగ్గనుంది. ప్రా జెక్టు నిర్మాణంతో ఎస్సారెస్పీ నుంచి గోదావరి ద్వా రా వచ్చే నీటిని సదర్‌మాట్ ప్రాజెక్టు వద్ద గేట్లు మూసి నిల్వ చేయనున్నారు. తద్వారా ప్రాజెక్టు వెనుక ఉండే మూలరాంపూర్, ఎర్దండి, కోమటికొండాపూర్ వైపు సుమారు 14కిలోమీటర్ల మేర నీటిని నిల చేయనున్నారు. ఫలితంగా భూగర్భజలాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో 1.58 టీఎంసీల నీరు నిల్వ ఉండి.. నిండుకుండను తలపిస్తోంది. ఎర్దండి, కోమటికొండాపూర్ వద్ద పుష్కరఘాట్లు మునిగిపోయాయి. ప్రాజెక్టు పక్కనుంచి బ్రిడ్జి నిర్మించడం ద్వారా జగిత్యాల జిల్లా నుంచి నిర్మల్ జిల్లా పొన్కల్ వైపు వెళ్లెందుకు దూరభారం తగ్గుతుంది.
370 ఎకరాలు ముంపు
ప్రాజెక్టు కింద ఇబ్రహీంపట్నం మండలంలోని మూ లరాంపూర్, ఎర్దండి, కోమటికొండాపూర్ గ్రామాల పరిధిలో సుమారు 370 ఎకరాలు ముంపునకు గురైంది. నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించడంతో రైతులు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించారు.
ప్రారంభానికి సిద్ధం చేస్తున్న అధికారులు
సదర్‌మాట్ బ్యారేజీ కమ్ బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ఇప్పటికే శిలఫలకం అమర్చేందుకు పైలన్, హెలిపాడ్లు నిర్మించారు.
ప్రారంభానికి ఏర్పాట్లు
ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.
– సురేందర్, సదర్‌మాట్ ప్రాజెక్టు డీఈ
ప్రారంభానికి సదర్‌మాట్ సిద్ధం


