మున్సిపోల్స్ సందడి
ఓటరు జాబితా తయారీలో అధికారులు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు ఏడాదికాలంగా కొనసాగుతున్న ప్రత్యేక పాలన
జగిత్యాల: మున్సిపాలిటీల్లో మున్సిపోల్స్ సందడి మొదలైంది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఇటీవలే పంచాయతీ పోరు ముగియడంతో ప్రభుత్వం బల్దియాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాల పథకాల కింద రావాల్సిన గ్రాంట్లు, ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవడంతో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మున్సిపాలిటీల ఎన్నికలకు సమయాత్తం అవుతోంది. అధికారులు ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల సమాచారం, మున్సిపాలిటీలవారీగా పునర్విభజన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల ఒకటో తేదీన వార్డులు, పోలింగ్ కేంద్రాల వారిగా ముసాయిదా ఓటర్ల జాబితా తయారు చేసి అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం నోటీస్ బోర్డులో ఉంచనున్నారు. ఈనెల 5న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 6న జిల్లాస్థాయి సమావేశం ఏర్పాటు చేసి.. 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను రూపొందించనున్నారు.
ఆశావహుల్లో సందడి
మున్సిపల్‌లో ఓటరు జాబితా రూపొందిస్తున్న నేపథ్యంలో కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయన్న భావనలో కొందరు కౌన్సిలర్లుగా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆశావహ అభ్యర్థుల్లో సందడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించడంతో నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వార్డుల్లో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వివిధ పనులు చేపడుతున్నారు. నిలబడే అభ్యర్థులు కాలనీల్లో వాటర్, డ్రైనేజీ, వీధిలైట్ల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. ఎలాగైనా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో ఇప్పటినుంచే ప్రతి ఇంటింటికీ తిరుగుతున్నారు. జగిత్యాలలో 48 వార్డులు ఉండగా.. ఈసారి రెండు వార్డులు పెరిగాయి. మిగతా మున్సిపాలిటీల్లో యథావిధిగా ఉన్నాయి. పురపాలకల్లో పాత రిజర్వేషన్ల ప్రకారమా..? రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు ఉంటాయా..? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతమైతే అధికారులు ఓటర్ల వారిగా జాబితాను రూపొందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తాజామాజీ పాలకవర్గ సభ్యులతోపాటు, గతంలో ఓడిపోయిన అభ్యర్థులు ప్రచారంలోకి దిగుతున్నారు. రిజర్వేషన్లు రాకముందే అనుకూలిస్తాయన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన వారు వారు చేసిన అభివృద్ధిని చూపుతూ ముందుకెళ్తున్నారు.
ప్రత్యేక పాలనలో..
జిల్లాలో పురపాలక సంఘాల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది అవుతోంది. 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 2025 జనవరితో ముగిసిపోయింది. అప్పటినుంచి ప్రత్యేక పాలనలోనే కొనసాగుతోంది. అప్పటినుంచి అభివృద్ధి కూడా అంతంతమాత్రంగానే ఉంది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఎవరైనా కాలనీల్లో సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. వీధిలైట్లు వెలగకున్నా.. డ్రైనేజీలు తీయకున్నా.. సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుందామన్నా.. ఇంటి అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు జరిగి కొత్త కౌన్సిలర్లు వస్తే కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంటుంది.


