ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే
కోరుట్ల: ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడేది సీపీఐ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. పార్టీ శత వసంతాల వార్షికోత్సవాల్లో భాగంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ కోరుట్లలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ వద్దగల అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి ర్యాలీ ప్రారంభించారు. సీ.ప్రభాకర్ స్మారక గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సీపీఐ చేసిన పోరాటంలో ఐదువేల మంది అమరులయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే శత జయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి చెన్నా విశ్వనాథం, రాష్ట్ర నాయకుడు తాళ్లపల్లి లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సుతారి రాములు, ఎండీ.మౌలానా, ముఖ్రం తదితరులు పాల్గొన్నారు.


