అమెరికాపై కేసు వేసిన షియోమీ

Xiaomi Files Legal Complaint Against US Defence - Sakshi

వాషింగ్టన్‌ : చైనా మిలటరీతో సంబంధాలు ఉన్న కంపెనీలో అమెరికన్లు పెట్టుబడులు పెట్టరాదంటూ అమెరికా ప్రభుత్వం గతంలో ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆంక్షలపై చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమీ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా మిలటరీతో సంబంధాలున్న కంపెనీల అధికారిక జాబితా నుంచి తమను తొలగించాలని కోరుతూ షియోమీ అమెరికా రక్షణ, ట్రెజరీ శాఖలను ప్రతివాదులుగా పేర్కొంటూ వాషింగ్టన్ జిల్లా కోర్టులో కేసు వేసింది. ట్రంప్ పాలనలో అమెరికా రక్షణ శాఖ షియోమీ, ఇతర ఎనిమిది కంపెనీలలో పెట్టుబడి పెట్టిన అమెరికన్లు వారి పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిషేధం అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ హయాంలో కూడా ఇదే విధంగా కొనసాగుతోంది. (చదవండి: బడ్జెట్ 2021: స్మార్ట్‌ఫోన్లపై ఉత్కంఠ!)

కానీ ఈ ఆరోపణలను షియోమి గతంలో తీవ్రంగా ఖండించింది. తామే కమ్యునిస్టు చైనా మిలటరీ కంపెనీ కాదంటూ స్పష్టం చేసింది. తమ సంస్థలో 75 శాతం ఓటింగ్ హక్కులను సహ వ్యవస్థాపకులు లిన్ బిన్, లీ జున్ కలిగి ఉన్నారని షియోమీ పేర్కొంది. అయితే నూతన అధ్యక్షుడు బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయినా ఊరట లభిస్తుందని ఆశించిన షియోమికి నిరాశే ఎదురైంది. నిషేధం ఎత్తివేసే దిశగా జో బైడెన్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఈ నిషేధాన్ని కోర్టులో సవాలు చేసేందుకు షియోమీ నిర్ణయించుకుంది. కంపెనీ వాటాదారులలో "గణనీయమైన సంఖ్యలో" యుఎస్ వ్యక్తులు ఉన్నారని, సాధారణ వాటాలను కలిగి ఉన్న మొదటి పది మందిలో ముగ్గురు యుఎస్ సంస్థాగత పెట్టుబడి పెట్టినట్లు సంస్థ పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top