పరస్పర సహకారంతో ముందుకు సాగుదాం: జిన్‌పింగ్‌

Xi Jinping Congratulates Joe Biden On US Election Win - Sakshi

జో బైడెన్‌కు జిన్‌పింగ్‌ శుభాకాంక్షలు

బీజింగ్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర సహకారంతో ద్వైపాక్షిక బంధాలు మెరుగుపరచుకుంటూ ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరావృద్ధి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని పరస్పరం గౌరవించుకుంటూ ఉద్రిక్తతలు చల్లారే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిన్‌పింగ్‌.. అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాసినట్లు చైనా అధికార మీడియా బుధవారం కథనం వెలువరించింది.

‘‘ఇరు దేశాల ప్రయోజనాలు, ప్రజా శ్రేయస్సుకై ఆరోగ్యకరమైన వాతావరణంలో అమెరికా- చైనాల మధ్య సంబంధాలు బలపడేలా ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది’’ అని జిన్‌పింగ్‌ పేర్కొన్నట్లు వెల్లడించింది. ఇక చైనా ఉపాధ్యక్షుడు వాంగ్‌ కిషాన్‌, అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్‌కు అభినందనలు తెలిపినట్లు షినువా న్యూస్‌ పేర్కొంది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ విజయం ఖరారైనప్పటికీ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తాము స్పందిస్తామని చైనా గతంలో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే నవంబరు 13న తాము జో బైడెన్‌ విజయాన్ని గుర్తిస్తున్నట్లు పేర్కొంది. (చదవండి: చైనా దూకుడు: ఆంటోని కీలక వ్యాఖ్యలు)

కాగా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు మంగళవారం అధికార మార్పిడికి సుముఖత వ్యక్తం చేయగా.. ఇందుకు సంబంధించిన ప్రక్రియను శ్వేతసౌధ అధికారులు ప్రారంభించారు. దీంతో జనవరిలో జో బైడెన్‌ అధ్యక్ష పగ్గాలు స్వీకరించేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో డ్రాగన్‌ దేశాధ్యక్షుడు ఈ మేరకు శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. ఇక ట్రంప్‌ హయాంలో అమెరికా- చైనా మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆరోపణలు, చైనీస్‌ కంపెనీలపై నిషేధం సహా వాణిజ్య పరంగా డ్రాగన్‌ దేశంతో అగ్రరాజ్యం యుద్ధానికి తెరతీసింది.  (చదవండి: అమెరికాను అగ్రపథంలో నిలుపుతాం!)

అంతేగాక దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి గండి కొట్టేలా క్వాడ్‌(అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌) సమూహాన్ని ఏర్పరచి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాక తైవాన్‌, హాంకాంగ్‌కు మద్దతుగా గళాన్ని వినిపిస్తూ అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో బంధాలు పునరుద్ధరించుకునే దిశగా జిన్‌పింగ్‌ అగ్రరాజ్య నూతన అధ్యక్షుడికి సందేశం పంపడం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top