అది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌.. ఒక సీక్రెట్‌ ప్లాట్‌ఫారం కూడా ఉంది!

worlds largest railway station grand central terminal - Sakshi

భూమిపై నడిచే ప్రజారవాణా వ్యవస్థలలో రైలు అత్యంత చౌకైన ‍ప్రయాణ సాధనమని చెప్పుకోవచ్చు. ఇది ప్రయాణాలకు ఎంతో సౌలభ్యకరమైనదని కూడా అంటారు. అయితే రైలులో ప్రయాణించేందుకు రైల్వే స్టేషన్‌ వెళ్లాల్సివుంటుందనే సంగతి మనకు తెలిసిందే. స్టేషన్లలోని ప్లాట్‌ఫారాల వద్దకు వచ్చి రైళ్లు ఆగుతుంటాయి. అప్పుడు ప్రయాణికులు రైలులోకి ఎక్కుతుంటారు.

అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫారం విషయానికొస్తే అది మన దేశంలోనే ఉంది. కర్నాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్‌ (Hubballi Railway Station)లోని ప్లాట్‌ఫారం నంబరు-8 ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారం. దీని పొడవు 1507 మీటర్లు. ఇక అతిపెద్ద రైల్వే స్టేషన్‌ విషయానికొస్తే హౌరా జంక్షన్‌ ముందు వరుసలో ఉంటుంది. ఈ స్టేషన్‌లో మొత్తం 26 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వేస్టేషన్‌ ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలోని గ్రాండ్‌ సెంట్రల్‌ టెర్మినల్‌ (Grand Central Terminal) రైల్వేస్టేషన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌. దీని నిర్మాణం 1903 నుంచి 1913 మధ్యకాలంలో జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ రైల్వేస్టేషన్‌లో మొత్తం 44 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ రైల్వేస్టేషన్‌లో రెండు అండర్‌గగ్రౌండ్‌ లెవెల్స్‌ ఉన్నాయి. దీనిలోని పైలెవెల్‌లో 41 ట్రాకులు, కింది లెవెల్‌లో 26 ట్రాకులు ఉన్నాయి. ఈ స్టేషన్‌ మొత్తం 48 ఎకరాల్లో నిర్మితమయ్యింది.

ఈ స్టేషన్‌ మీదుగా ప్రతీరోజు మొత్తం 660 మెట్రో నార్త్‌ ట్రైన్స్‌ నడుస్తాయి. లక్షా 25వేల మందికి మించిన ప్రయాణికులు ప్రతీరోజూ ఈ రైళ్లలో ప్రయాణిస్తారు. ఈ రైల్వే టెర్మినల్‌లో ఒక సీక్రెట్‌ ప్లాట్‌ఫారం కూడా ఉంది.అది Waldorf Astoria హోటల్‌కు సరిగ్గా దిగువన ఉంది. నాటి అమెరికా అధ్యక్షుడు ఫ​్రాంక్లిన్‌ డీ రూజ్‌వెల్డ్‌ ఈ ప్లాట్‌ఫారం వినియోగించేవారని చెబుతారు. హోటల్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన దీనిని వినియోగించేవారట. ఈ సీక్రెట్‌ ప్లాట్‌ఫారం రెగ్యులర్‌ సర్వీసుల కోసం వినియోగించకపోవడం విశేషం. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top