
ప్రపంచంలోనే ఎత్తయిన వంతెనగా రికార్డు
బీజింగ్: ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల్లో అద్భుతాలు సృష్టించడంలో డ్రాగన్ దేశం చైనా ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇప్పుడు మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనను ఆదివారం అధికారికంగా ప్రారంభించింది. వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. నైరుతి చైనాలోని గిజౌ ప్రావిన్స్‌లో ‘హుజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జి’ పేరిట ఈ భారీ వంతెన నిర్మించారు. ఈ బ్రిడ్జి ఎత్తు 625 మీటర్లు. అంటే ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కంటే రెండు రెట్లు ఎక్కువ.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనగా హుజియాంగ్ బ్రిడ్జి రికార్డుకెక్కింది. మొత్తం పొడవు 2,890 మీటర్లు. రెండు ఆధార స్తంభాల మధ్య(స్పాన్) వంతెన పొడవు 1,420 మీటర్లు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్పాన్ బ్రిడ్జిగా మరో రికార్డు సృష్టించింది. కొండ ప్రాంతంలో దీన్ని నిర్మించారు. 2022లో నిర్మాణ పనులు మొదలయ్యా యి. మూడేళ్లలోనే పూర్తయ్యాయి. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నిర్మాణంలో ఇంటెలిజెంట్ కేబుల్ హోస్టింగ్ సిస్టమ్‌తోపాటు 2,000 ఎంపీకే హై–్రస్టెంత్ స్టీల్ వైర్ ఉపయోగించారు. ఈ మహా వంతెనకు 21 పేటెంట్లు దక్కడం గమనార్హం.
మారుమూల ప్రాంతంలో ఇది అందుబాటులోకి రావడంతో ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరుగుతుందని, స్థానికంగా అభివృద్ధి వేగం పుంజుకుంటుందని, నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు రాబోతున్నాయని, అధికారులు చెప్పారు. వంతెన ప్రారంబోత్సవానికి వేలాది మంది జనం హాజరయ్యారు. సంబరాల్లో మునిగిపోయారు. పరస్పరం తమ ఆనందం పంచుకున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన బ్రిడ్జి తమ ప్రాంతంలో అందుబాటులోకి రావడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. నాటు పడవలపై ప్రయాణించే అగత్యం ఇక తప్పిపోయిందని, కొత్త వంతెనపై రయ్‌రయ్ అంటూ దూసుకెళ్తామని అన్నారు.