రాజకీయాలకు కమలా హారిస్‌ గుడ్‌బై?! | Will Kamala Harris Quit Politics What Analysts Says | Sakshi
Sakshi News home page

రాజకీయాలకు కమలా హారిస్‌ గుడ్‌బై?!

Nov 9 2024 8:10 PM | Updated on Nov 9 2024 8:19 PM

Will Kamala Harris Quit Politics What Analysts Says

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఏం చేయబోతున్నారు?. అమెరికా కోసం మొదలుపెట్టిన పోరాటాన్ని.. కొనసాగిస్తానని చెప్పిన మాట మీద ఆమె నిలబడతారా?. లేదంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆమె భావిస్తున్నారా?.

ట్రంప్‌ చేతిలో ఓటమి తర్వాత హోవార్డ్‌ యూనివర్సిటీలో కమలా హారిస్‌ గంభీరంగానే ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం మొదలుపెట్టిన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. అయితే..  మరో 72 రోజుల్లో ఆమె ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ తర్వాత ఆమె ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

సాధారణంగా.. అమెరికా అధ్యక్షఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు.. మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశాలు దక్కుతుంటాయి. లేదంటే ఏదో ఒక కీలక పదవుల్లో వాళ్లకు అవకాశాలు దక్కవచ్చు.  2004లో జార్జి బుష్‌ చేతిలో ఓటమిపాలైన జాన్‌ కెర్రీ.. బరాక్‌ ఒబామా రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అంటే.. ఓడిపోతే రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట.

అయితే జాన్‌ కెర్రీలా తిరిగి రాజకీయాల్లో రాణించేందుకు ఛాన్స్‌ కమలకు ఉంది . 2017 నుంచి 2021 మధ్య కాలిఫోర్నియా నుంచి సెనేట్‌కు ఆమె ప్రాతినిధ్యం వహించారు. అయితే మళ్లీ సెనేట్‌కు వెళ్లేందుకు ‘ఇంటిపోరు’ ఆమెకు ఆటంకంగా మారే అవకాశం లేకపోలేదు.  

సొంత రాష్ట్రంలో.. డెమోక్రటిక్‌ మద్దతుదారుల నుంచే ఆమెకు వ్యతిరేక గళం వినిపిస్తోంది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలిచ్చినవాళ్లూ ఆమె పట్ల అసంతృప్తితోనే ఉన్నారనే సంకేతాలు అందుతున్నాయి. పోటీ డెమోక్రటిక్‌ ప్రతినిధిగా కొనసాగుదామన్నా.. అందుకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. ఈ లెక్కన.. 2028 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అభ్యర్థిత్వం కోసం ఆమె తీవ్రంగానే శ్రమించాల్సి ఉంటుంది. అలాకాకుంటే..

రాజకీయాలకు దూరం జరిగి హిల్లరీ క్లింటన్‌, ఏఐ గోర్‌ మాదిరి సాహిత్య రచన, ఇతర వ్యాపకాల్లో మునిగిపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. తన పోరాటం కొనసాగుతుందని కమలా హారిస్‌ ప్రకటించినప్పటికీ.. అందుకు అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవేవీకాకుండా ఆమె తన వ్యక్తిగత జీవితంపై దృష్టిసారించవచ్చనే అభిప్రాయమూ ఒకటి వినిపిస్తోంది. కమలా హారిస్‌ వయసు 60 ఏళ్లు. కాబట్టి, అధ్యక్ష ఎన్నికల రేసులో ఆమెకు బోలెడు అవకాశం ఉందని ఆమెకు దగ్గరి వ్యక్తులు చెబుతున్నారు. ఆమె నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది 2025 జనవరి 20 తర్వాత తేలిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement