‘మర్యాదగా ఒప్పందానికైనా రండి.. లేదంటే కథ ముగిస్తాం’ | Will Either Make Deal Or Finish The Job: Trump Fresh Warning To Iran | Sakshi
Sakshi News home page

‘మర్యాదగా ఒప్పందానికైనా రండి.. లేదంటే కథ ముగిస్తాం’

Jul 7 2026 9:45 AM | Updated on Jul 7 2026 9:50 AM

Will Either Make Deal Or Finish The Job: Trump Fresh Warning To Iran

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్‌ స్టేజీకి చేరాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "మర్యాదగా మాతో ఒప్పందానికైనా రావాలి.. లేదంటే కథ ముగించేస్తాం అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించగా.. ప్రస్తుతం ఇరాన్‌లో ఆయన అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ వేదికగా ట్రంప్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఏ రకంగానైనా విజయం సాధించి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేశారు. "మేం ఎలాగైనా గెలవబోతున్నాం. అయితే ఒక ఒప్పందానికి వస్తాం.. లేదా కథ ముగించేస్తాం. ఇరాన్ పని ముగించడం మాకేమీ అంత కష్టం కాదు. కానీ, నేను ఒప్పందానికే మొగ్గు చూపుతాను.. ఎందుకంటే అక్కడ ఉన్న 91 మిలియన్ల (9 కోట్లకు పైగా) ప్రజలు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. మేం అనుకుంటే కేవలం ఒక్క గంటలోనే ఇరాన్‌లోని వంతెనలన్నింటినీ నేలమట్టం చేయగలం" అని ట్రంప్ హెచ్చరించారు.

అలాగే ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మేం ఆ దేశం నుంచి రేడియోధార్మిక పదార్థాలను, సంపన్న యురేనియంను స్వాధీనం చేసుకోబోతున్నాం. ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఉన్న ధరల కంటే ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు మరింత తగ్గాయి. మేం కొన్ని రాయితీలు సాధించాం. వాటిని వారు కొనసాగించాల్సిందే" అని ఆయన పేర్కొన్నారు.

గత నెలలోనే అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి.. కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ ట్రంప్ మాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. జూలై 3న జరిగిన ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ అగ్రనాయకత్వం, మతాధికారులు భారీగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే

అమెరికా మీడియా సంస్థ 'ఆక్సియోస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... నాయకులంతా అక్కడే గుమికూడారు. ఒక్క దెబ్బతో వారందరినీ మట్టుబెట్టే అవకాశం మాకు వచ్చింది. కానీ మేం అలా చేయలేదు. ఎందుకంటే వారందరినీ చంపేస్తే ఆ తర్వాత మేం ఎవరితో చర్చలు జరపాలి?" అని అన్నారు. ఖమేనీ అంత్యక్రియలకు అంతమంది తరలిరావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. "చాలామంది ఇరాన్ ప్రజలు ఖమేనీకి వ్యతిరేకమనుకున్నా.. బహుశా అవన్నీ నకిలీ కన్నీళ్లు కావచ్చు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. జూలై 4న 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న అమెరికాకు అసలు నాగరికత, చరిత్రే లేవని ఎద్దేవా చేసింది. "మనుషులను చంపగలరు.. కానీ ఆదర్శాలను కాదు. మీరు ఆయతుల్లా ఖమేనీని చంపి ఉండొచ్చు. కానీ నిజానికి మీరు ఒక సెంట్ల సీసాను పగలగొట్టారు.. దాంతో ఆ సువాసన ఇప్పుడు అన్ని వైపులా వ్యాపించింది. ఈ విషయాలు మీకు అర్థం కావు... ఎందుకంటే అమెరికాకు అటు నాగరికత లేదు, ఇటు చరిత్ర లేదు, అసలు గౌరవమే లేదు. .ఖమేనీ అంత్యక్రియలకు తరలివచ్చిన జనసందోహాన్ని చూసైనా అమెరికా వాస్తవాన్ని గ్రహించాలని ఇరాన్ ఈ సందర్భంగా హితవు పలికింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement