
అమెరికాను కుదిపేసిన లైంగిక కుంభకోణం ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో.. అమెరికా విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలకు దిగారు. ఈ వ్యవహారంలో ట్రంప్ పాత్రపైనా ఎఫ్‌బీఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారామె.
1996లో మరియా ఫార్మర్ ఫిర్యాదుతోనే జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రముఖ ఫైనాన్షియర్ ఎప్‌స్టీన్‌తో పాటు అతని సన్నిహితురాలైన గిస్లేన్ మాక్స్‌వెల్‌పై కేసులు నమోదు అయ్యాయి. అటుపై ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులు ఉన్నారన్న ఆరోపణల నడుమ.. అగ్రరాజ్యంలో ఈ కేసు సంచలనాత్మకంగా మారింది.
తాజాగా.. న్యూయార్క్ టైమ్స్‌కి మరియా ఫార్మర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్‌నూ ఎఫ్‌బీఐ విచారించాలని కోరారామె. అది 1995లో ఓ అర్ధరాత్రి. నేను మాన్‌హట్టన్‌లోని ఎప్‌స్టీన్ ఆఫీస్‌లో ఉన్నా. కాస్త కురచైన దుస్తులే నేను వేసుకుని ఉన్నా. ఇంతలో సూట్‌లో ఓ వ్యక్తి వచ్చారు. నా కాళ్ల వంకే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఎప్‌స్టీన్ లోపలికి నడుచుకుంటూ వచ్చారు. ‘‘లేదు.. లేదు.. ఆమె నీకోసం రాలేదు’’ అంటూ ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ సమయంలో ‘‘ఆ పిల్లకి 16 ఏళ్లు ఉంటుందా?’’ అని ఆయన ఎప్‌స్టీన్‌ను అడగడం నేను విన్నాను అని ఫార్మర్ చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి ఎవరో కాదని.. డొనాల్డ్ ట్రంప్ అని ఆమె బాంబ్ పేల్చారు.
అయితే ఎప్‌స్టీన్‌తో ఉండగా ట్రంప్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఏనాడూ తాను చూడలేదని, కానీ, ఆరోజు జరిగింది మాత్రం తాను జీవితాంతం గుర్తు పెట్టుకున్నానని అన్నారామె. ‘‘ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే విషయాన్ని నేను 1996, 2006లో ఎఫ్‌బీఐ ముందు చెప్పాను. కానీ, ఇప్పటిదాకా ఆయన్ని దర్యాప్తు సంస్థ విచారించలేదు. ఎందుకు?’’ అని ప్రశ్నించారామె. అయితే..
ఎప్‌స్టీన్ వ్యవహారంలో(ఫైల్స్‌లోనూ) ఇప్పటిదాకా ట్రంప్ పాత్ర ఉన్నట్లుగానీ, కనీసం అనుమానితుడిగానైనా ఆయన పేరు ఉన్నట్లుగానీ ఏ దర్యాప్తు సంస్థ చెప్పలేదు. ఇక మరియా ఫార్మర్ తాజా ఆరోపణలను వైట్‌హౌజ్ వర్గాలు కొట్టిపారేశాయి. ‘‘ఎప్‌స్టీన్ ఆఫీస్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఏనాడూ వెళ్లింది లేదు. పైగా అతని(ఎప్‌స్టీన్)పై ఆరోపణలు రాగానే తన క్లబ్ నుంచి ట్రంప్ బయటకు పంపించేశారు కూడా’’ అని కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ షెవుంగ్ మీడియాకు తెలిపారు. ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లీవిట్ న్యూయార్క్ టైమ్స్ కథనాలను తీవ్రంగా తప్పుబట్టారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ట్రంప్ నడుమ మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు.. తిరగదోడి మరీ చెత్తను ప్రచురిస్తున్నారంటూ మండిపడ్డారు.
ట్రంప్-ఎప్‌స్టీన్ మధ్య సంబంధాల గురించి చర్చ దశాబ్దాలుగా నడుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి పలు పార్టీల్లో పాల్గొన్న ఫొటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ విషయంలో ట్రంప్ మద్దతుదారులే తరచూ ఆయన్ని తరచూ విమర్శిస్తుండడం గమనార్హం. అయితే ట్రంప్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. లైంగిక ఆరోపణల తర్వాత అతనికి(ఎప్‌స్టీన్) దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.
2003లో ఎప్‌స్టీన్‌కు ట్రంప్ బర్త్‌డే విషెస్.. అది కూడా విచిత్రంగా చెప్పారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ఇచ్చింది. ఈ కథనంపై భగ్గుమన్న ట్రంప్.. సదరు వార్తా సంస్థపై 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ మరియా ఫార్మర్ ఇంటర్వ్యూను ప్రచురించడంపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.
అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎప్‌స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి.
ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్‌స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్‌వెల్‌పై.. అమ్మాయిలను, బాలికలను సరఫరా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. చైల్డ్‌సెక్స్ ట్రాఫికింగ్ కేసులో 2021లో ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తోంది. ఈ కేసులో ఉపశమనం కోసం ఆమె సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా.. అది విచారణ దశలో ఉంది.