ఇంటర్వ్యూల ఫార్మాట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రశ్న.. జవాబుల కంటే కఠిన ప్రశ్నలతో సంచలనాలు రేపే సెషన్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఎదురుగా డొనాల్డ్ ట్రంప్‌లాంటి నేతల ముందు అడుగు వేయడం అంటేనే చాలా మంది జర్నలిస్టులు జాగ్రత్తపడే పరిస్థితి. కానీ ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా ధైర్యంగా కఠిన ప్రశ్నలు వేసిన ఒక జర్నలిస్ట్.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారారు. ఇక చాలూ అనుకుంటూ ఆయన్ని ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేయించిన.. “ఆమె ఎవరబ్బా?” అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది..
ఆమె పేరు.. క్రిస్టెన్ వెల్కర్. ఎన్‌బీసీ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ట్రంప్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధానంగా.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఆధారాలు చూపాలంటూ ఆయన్ని పదే పదే ప్రశ్నించారు. అయితే ఆయన మాత్రం ఆ ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే అంశాన్ని ఆమె మళ్లీ మళ్లీ ప్రస్తావించడంతో ఇంటర్వ్యూ వాతావరణం క్రమంగా ఉద్రిక్తంగా మారింది. సారీ డార్లింగ్ అంటూనే.. తీవ్రంగా విమర్శిస్తూ ట్రంప్ విసుగ్గా కోటుకు ఉన్న లాపెల్ మైక్, వైర్‌లెస్ ట్రాన్స్‌మిటర్‌తో పాటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత అమెరికా మీడియా ప్రపంచంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఒక్కసారిగా దృష్టి మొత్తం క్రిస్టెన్ వెల్కర్ వైపుకే మళ్లింది.




