అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్‌ ప్లాన్‌తో టెన్షన్‌లో ట్రంప్‌! | White House Responds Over China Rare Earth Limits, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్‌ ప్లాన్‌తో టెన్షన్‌లో ట్రంప్‌!

Published Tue, Apr 15 2025 11:03 AM | Last Updated on Tue, Apr 15 2025 11:23 AM

White House responds Over China rare earth limits

వాషింగ్టన్‌: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదంటూ చైనా, అమెరికా మధ్య ట్రేడ్‌ వార్‌ నడుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చైనా గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా నిర్ణయంపై వైట్‌హౌస్‌ స్పందించారు.

తాజాగా ట్రంప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారుల్లో ఒకరైన కెవిన్‌ హసెట్‌ మాట్లాడుతూ..‘చైనా అరుదైన ఖనిజాల నిలిపివేత ఆందోళనకరం. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్‌ తయారీ రంగంలో వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఖనిజాలు లేకపోవడం అమెరికాకు నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ అంశంపై పలు మార్గాలను అన్వేషిస్తున్నామని’ అన్నారు. ఇదే సమయంలో ట్రంప్ తన టారిఫ్ ప్రణాళికలతో ప్రపంచ వాణిజ్యానికి ఆర్థిక మాంద్యం తెచ్చే పరిస్థితులు వందకు వంద శాతం లేవని క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు.. ఇదే అంశంపై యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనా.. పరస్పర సుంకాలపై రెండు దేశాలు బెదిరింపులకు దిగుతున్నప్పటికీ దీనిపై ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదన్నారు. అలాగే, చైనాతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో ఒప్పందం కాస్త కష్టమేనని వ్యాఖ్యానించారు. ఎందుకంటే తమ దేశానికి చైనా అతిపెద్ద ఆర్థిక పోటీదారని, సైనిక ప్రత్యర్థి అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. అమెరికా ఈ ఖనిజాలను 90 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్‌వేర్‌ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఏప్రిల్ రెండు నుంచి చైనా వాటిని నియంత్రణ జాబితాలో చేర్చింది. అమెరికాకు ఒక అరుదైన లోహాలు ఉత్పత్తి చేసే గని కూడా ఉంది. అయినా ఆ దేశ వినియోగంలో ఎక్కువ భాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ ఖనిజాలపైనే కాకుండా అయస్కాంతాల ఎగుమతిని డ్రాగన్‌ నిలిపివేసింది. దీంతో, ట్రంప్‌ సర్కార్‌కు ఊహించని షాక్‌ తగిలింది.

ఇక.. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం సుంకం విధించగా.. చైనా కూడా అంతే వేగంగా దూకుడు ప్రదర్శించింది. అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇక, ఈ టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని ట్రంప్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి రాయితీ లభించదని తేల్చి చెప్పేశారు. ఆ దేశం తమతో దారుణంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement