ఆలస్యం వద్దు.. చైనాకు రాకపోకలు నిషేధించండి: బైడెన్‌కు సెనేటర్ల లేఖ

US Senators letter to Joe Biden amid mystery illness - Sakshi

వాషింగ్టన్‌: అంతుచిక్కని బ్యాక్టీరియల్ న్యుమోనియా వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతోంది. చైనాలో చిన్నపిల్లలో న్యుమోనియా కేసుల తరహాలోనే.. ఇప్పుడు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు అవుతున్నాయట. ఈ నేపథ్యంలో అమెరికాలోని రిపబ్లికన్‌ సెనెటర్లు అమెరికా-చైనా మధ్య ప్రయాణ రాకపోకలను(ట్రావెల్‌ బ్యాన్‌ను) వెంటనే నిషేధించాలని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. 

రిపబ్లికన్‌ సెనెటర్ల తరఫున ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియో, బైడెన్‌కు రాసిన లేఖలో.. ‘చైనాలో వేగంగా విస్తరిస్తున్న బ్యాక్టీరియల్ న్యుమోనియాను.. అమెరికాలో వ్యాపించకుండా అడ్డుకునేందుకు వెంటనే చైనాతో ప్రయాణ రాకపోకలను నిషేధించాలి. గతంలో పలు ప్రజారోగ్య సంక్షోభాలకు చైనా కారణమైంది. ముఖ్యంగా కరోనా సమయంలో.. వైరస్‌ ఎలా పుట్టిందనేదానికి ఆ దేశం స్పష్టత ఇవ్వలేదు. ఇచ్చిన వివరణలోనూ పారదర్శకత లోపించింది. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి’ అని కోరారు.

.. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించేంత దాకా మేం చూస్తూ ఉండలేం. అమెరికన్ల ఆరోగ్యం, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా అవసమైన చర్యలు తీసుకుంటాం. ప్రయాణ నిషేధంతో న్యూమోనియా కేసుల పెరుగుదల, మరణాలు, లాక్‌డౌన్‌ విధించడం వాటిని నిరోధించవచ్చు అని లేఖలో రూబియో అభిప్రాయపడ్డారు. ఈ లేఖపై వైట్‌హౌజ్‌ స్పందించాల్సి ఉంది.

మరోవైపు పెరుగుతున్న న్యుమోనియా కేసులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top