Ukraine Tensions: ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?! ఈ సంక్షోభం ఎందుకు?

US puts 8,500 troops on alert to deploy amid Russia tension - Sakshi

ఆక్రమణకు రష్యా తొందర

అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నం

యుద్ధ నౌకలు తరలించిన నాటో దళాలు

యూరప్‌లో అత్యంత పేద దేశం ప్రస్తుతం కొత్త కోల్డ్‌వార్‌కు వేదికగా మారింది. ఒకప్పుడు తమతో కలిసున్న ఉక్రెయిన్‌ను ఎలాగైనా మళ్లీ స్వాధీనం చేసుకోవాలని రష్యా ప్రయత్నిస్తుండగా, ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు అమెరికా, మిత్రపక్షాలు రెడీగా ఉన్నాయి. సింహాల మధ్య పోరులో జింకలు బలైనట్లు అగ్రరాజ్యాల ఆటలో పేదదేశం నలిగిపోతోంది. అసలేంటి ఈ ఉక్రెయిన్‌ సంక్షోభం? చూద్దాం..

నూతన సంవత్సరం ఆరంభంతో ఉక్రెయిన్‌పై అమెరికా, రష్యాల మధ్య వార్నింగుల పర్వం కూడా ఆరంభమైంది. ఆ దేశాన్ని ఆక్రమించాలని పుతిన్‌ యత్నిస్తే మూల్యం తప్పదని అమెరికా ప్రెసిడెంట్‌ జోబైడెన్‌ హెచ్చరించారు. ఈ వార్నింగులను లెక్కచేయకుండా రష్యా దాదాపు లక్షమంది సైనికులను ఉక్రెయిన్‌ సరిహద్దుకు తరలించింది. ఉక్రెయిన్‌ విషయంలో తాము తొందరపడకూడదంటే అమెరికా, మిత్రపక్షాలు కొన్ని హామీలివ్వాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది. ముఖ్యంగా నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకుండా ఉండడం, తూర్పు యూరప్‌లో నాటో బలగాల ఉపసంహరణ లాంటి డిమాండ్లకు అమెరికా అంగీకరించడంలేదు. ఈ నేపథ్యంలో నాటోదేశాలు సోమవారం యుద్ధనౌకలను బరిలోకి దింపడం మరింత ఉద్రిక్తతలకు కారణమైంది. ఏక్షణమైనా యుద్ధం మొదలుకావచ్చన్న భయాలున్నాయి.  

2014లో బీజాలు
30 ఏళ్ల క్రితం రష్యా నుంచి విడిపోయిన తర్వాత ఉక్రెయిన్‌ విజయవంతంగా మనుగడ సాగించడంలో తడబడుతూ వచ్చింది. యూరప్‌తో ఒప్పందాలను తెంచుకొని రష్యాతో బంధం బలపరుచుకోవాలని 2014లో అప్పటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ నిర్ణయించడం దేశంలో విప్లవానికి దారితీసింది. దీంతో విక్టర్‌ పదవి నుంచి దిగిపోవాల్సివచ్చింది. దీనిపై ఆగ్రహించిన రష్యా ఆ సంవత్సరం ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించింది. ఆ సమయంలో జరిగిన హింసాకాండ దేశంలో రష్యాపై విముఖతను, పాశ్చాత్య దేశాలపై సుముఖతను పెంచింది. ఈ నేపథ్యంలో 2024లో యూరోపియన్‌ యూనియన్‌లో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటామని తాజాగా ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే నాటోలో చేరాలన్న కోరికను కూడా వ్యక్తం చేసింది. ఇది రష్యాకు మరింత కోపం తెప్పించింది. ఉక్రెయిన్‌ నాటోలో చేరితే సరిహద్దుల్లో బలమైన శత్రువుకు అవకాశం కల్పించినట్లవుతుందని పుతిన్‌ యోచన.  

ఉత్తుత్తి బెదిరింపులే..
సాంస్కృతికంగా రష్యాతోనే ఉక్రెయిన్‌కు సంబంధాలు అధికమని పుతిన్‌ చెబుతుంటారు. అందుకే నాటో, ఈయూలో చేరడం కన్నా తమతో కలిసిపోవడం మేలంటారు. అలాగే పలు సందర్భాల్లో రష్యాపై విధించిన ఆంక్షలు తొలగించేందుకు ఉక్రెయిన్‌ అంశాన్ని పావుగా వాడుకోవాలన్నది పుతిన్‌ ఆలోచనగా నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే మరిన్ని ఆంక్షలు రష్యాపై పడతాయి, అందుకే పూర్తి స్థాయి యుద్ధం చేసి ఉక్రెయిన్‌ను ఆక్రమించే కన్నా ఆక్రమిస్తామన్నంత హడావుడి చేయడం ద్వారా ఆంక్షలను తొలగించుకోవాలని పుతిన్‌ భావిస్తున్నారు. ఈ మొత్తం అంశంలో అమెరికాకు ఆసక్తి ఎందుకంటే.. సమాధానం చాలా సింపుల్‌. ప్రపంచంలో ఎక్కడ సమస్య కనిపించినా పెద్దన్న పాత్ర పోషించాలని యూఎస్‌ భావిస్తుంటుంది. పైగా ఈ సమస్యలో రష్యా కూడా ఉండడంతో అమెరికా మరింత చురుగ్గా పావులు కదుపుతోంది. అవసరమైతే ఉక్రెయిన్‌కు మిలటరీ సాయం కూడా చేస్తామని ప్రకటిస్తోంది. అటు రష్యా, ఇటు అమెరికా మధ్యలో ఉక్రెయిన్‌ సమాజం నలిగిపోతోంది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top