
అమెరికాలోనే ఐఫోన్ల ఉత్పత్తి
లేదంటే 25% శాతం సుంకాలు
వాషింగ్టన్: ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలంటూ యాపిల్ కంపెనీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింతగా ఒత్తిడి పెంచారు. భారత్‌తో సహా మరెక్కడ ఉత్పత్తి చేసినా 25 శాతం దిగుమతి సుంకం తప్పదంటూ తాజాగా అల్టిమేటం జారీ చేశారు. ‘‘అమెరికాలో విక్రయించే ఐఫోన్లను ఇక్కడే తయారు చేయాలని యాపిల్ చీఫ్ టిమ్ కుక్‌కు ఎప్పుడో చెప్పా. భారత్‌లోనో, మరో దేశంలోనే తయారు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశా. కానీ ఆయన వినడం లేదు. అందుకే యాపిల్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధించాలని నిర్ణయించా’’ అని శుక్రవారం తన సొంత ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ వెల్లడించారు.
టారిఫ్‌ల భారాన్ని తగ్గించుకునేందుకు ఐఫోన్ల తయారీని చైనా నుంచి భారత్‌కు మార్చాలని కుక్ నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా టారిఫ్ బాంబు పేల్చారు. గత వారం పశ్చిమాసియాలో పర్యటన సమయంలోనే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించడం తెలిసిందే. అమెరికా నిర్ణయంతో ఐఫోన్ల ధరలకు రెక్కలొచ్చే అవకాశం కన్పిస్తోంది. అదే జరిగితే ఫోన్ల అమ్మకాలు పడిపోయి సంస్థ లాభాలపై ప్రభావం పడనుంది. ట్రంప్ టారిఫ్‌లతో తలెత్తిన అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు ఎలా స్పందించాలో తెలియక అమెజాన్, వాల్‌మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పటికే అయోమయంలో పడ్డాయి.
ఈయూపై 50% బాదుడు
యూరోపియన్ యూనియన్ (ఈయూ) పైనా ట్రంప్ మరోసారి టారిఫ్‌ల కొరడా ఝళిపించారు. ఈయూతో అమెరికా వాణిజ్య చర్చలు సజావుగా సాగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి అన్ని రకాల ఈయూ ఉత్పత్తులపైనా 50 శాతం టారిఫ్ అమల్లోకి రానుందని ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించారు. అమెరికాలో తయారు చేసే వస్తువులపై ఎలాంటి టారిఫ్‌లూ ఉండవని సెలవిచ్చారు. ఈయూ దిగుమతులపై 10% పన్ను కొనసాగాలని ట్రంప్ పట్టుబడుతుండగా పూర్తిగా ఎత్తేయాలని ఈయూ కోరుతోంది. ఈ సమయంలో ఆయన ఉన్నట్టుండి ఇలా టారిఫ్ బాంబు పేల్చారు. చైనా మీదా ఇలాగే టారిఫ్‌లను ఆయన 145 శాతానికి తీసుకెళ్లడం, చివరికి 30 శాతానికి తగ్గించడం తెలిసిందే.