ఇరాన్‌లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్‌ చేసేశారా? | US, Iran Peace Talks Delay due to mojtaba khamenei | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్‌ చేసేశారా?

Apr 22 2026 7:45 PM | Updated on Apr 22 2026 9:29 PM

US, Iran Peace Talks Delay due to mojtaba khamenei

టెహ్రాన్‌: ఇరాన్‌ అంతర్గత అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై ఓ వైపు సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ.. ఆయన్ని కాదని ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చాపకింద నీరులా ప్రభుత్వంపై పట్టు బిగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ అంతర్గత పోరాటం కారణంగా పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా- ఇరాన్‌ కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ‘ఆపరేషన్‌ సక్సెస్‌ - పేషెంట్‌ డెడ్‌’ అన్న చందంగా ఇరాన్‌ వ్యవహారం మారింది. ప్రస్తుతం ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో హాట్‌టాపిక్‌గా మారి, అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అమెరికా సైతం చర్చలు విఫలమవడానికి, ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనని స్పష్టంగా చెబుతోంది. ఇంతకీ ఇరాన్‌లో ఏం జరుగుతోంది. 

ఇరాన్-అమెరికా శాంతి ఒప్పంద చర్చలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం భావిస్తోంది.

ఆరు వారాల క్రితం అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన గొంతు వినలేదు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌ కీలక నేతలను కోల్పోవడం వల్ల భయాందోళనలో ఉన్నారని సమాచారం.

అమెరికా మీడియా నివేదికల ప్రకారం, మొజ్తాబా ప్రత్యక్ష నిర్ణయాల్లో పాల్గొనకపోవడం వల్ల ఇరాన్‌ నాయకత్వంలో విభేదాలు పెరిగాయి. అణు కార్యక్రమంపై చర్చల్లో ఇరాన్‌ ప్రతినిధులకు ఎంత అధికారం ఇవ్వాలో స్పష్టత లేకపోవడం చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇరాన్‌ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం 440 కిలోల నిల్వ ఉంది. ఇది 90 శాతం ఆయుధ స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, ఎనిమిది నుంచి పన్నెండు అణు బాంబులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఈ అంశమే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది.

ఇంటర్నేషనల్‌ క్రైసిస్‌ గ్రూప్‌కి చెందిన అలీ వాయేజ్‌ ప్రకారం, మొజ్తాబా స్వయంగా చర్చలు జరిపే స్థితిలో లేరు. ఆయన కేవలం విస్తృత నిర్ణయాలకు ఆమోదం తెలుపుతున్నారని, చర్చల వ్యూహాల్లో ఆయన పాత్ర లేదని చెప్పారు. ఆయన గైర్హాజరీని ఇరాన్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూపిస్తోందని, ఇది అంతర్గత విమర్శల నుంచి రక్షణగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ప్రత్యక్షంగా కనిపించకపోవడం ఇరాన్‌ పాలనకు సవాలుగా మారింది. ఆయన పేరుతో టీవీల్లో వార్తలు, సోషల్‌ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలతో సందేశాలు పంపడం ఆయన ఆరోగ్యంపై, ఆయన ఎక్కడున్నారనే అనుమానాలను మరింత పెంచుతోంది.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్‌ దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారని సీఎన్‌ఎన్‌ నివేదిక తెలిపింది. మరోవైపు, రాయిటర్స్‌ ప్రకారం ఆయన ఆడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, యుద్ధం, అమెరికాతో చర్చల వంటి ప్రధాన అంశాలపై నిర్ణయాల్లో పాల్గొంటున్నారని సమాచారం.

ఇరాన్‌ ప్రభుత్వంలో కుమ్ములాట
ఇరాన్‌లో ప్రస్తుతం పెద్ద రాజకీయ కుమ్ములాట జరుగుతోంది. ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రభుత్వంపై పట్టు బిగించింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌ నియామకాలను అడ్డుకోవడం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించడాన్ని నిరోధించడం ద్వారా అధ్యక్షుడిని పూర్తిగా పక్కకు పెట్టిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.

మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఐఆర్‌జీసీ మరింత ఆధిపత్యం సాధించింది. ఆయన చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారులకు ఆయనను కలిసే అవకాశం లేకుండా చేసింది. దీంతో పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆలస్య​మవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.  

ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఐఆర్‌జీసీ ఆధిపత్యం పెరగడం వల్లే శాంతి చర్చలు నిలిచిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు

Advertisement
 
Advertisement
Advertisement