US Hunts Chinese Malware That Could Disrupt Military Operations - Sakshi
Sakshi News home page

అమెరికా రక్షణ పరికరాల్లో చైనా మాల్‌వేర్‌!

Jul 31 2023 4:18 AM | Updated on Jul 31 2023 6:59 PM

US hunts Chinese malware that could disrupt military operations - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం, ఆయుధాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఉన్న అమెరికాను ఇప్పుడు చైనా మాల్‌వేర్‌ బెంబేలెత్తిస్తోంది. ఓ అజ్ఞాత మాల్‌వేర్‌ను తమ రక్షణ పరికరాల్లో చైనా ప్రవేశపెట్టిందని అమెరికా సైనికాధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్‌ అధికారి ఒకరు నిర్ధారించారు.

తమ రక్షణ వ్యవస్థపై చైనా హ్యాకర్లు కన్నేశారని, రక్షణ శాఖ పరికరాల్లోకి ఓ కంప్యూటర్‌ కోడ్‌ను(మాల్‌వేర్‌) ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. సైన్యానికి చెందిన నెట్‌వర్క్‌ కంట్రోలింగ్‌ పవర్‌ గ్రిడ్‌లు, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్, సైనిక కేంద్రాలకు నీటిని సరఫరా చేసే వ్యవస్థల్లోకి ఈ మాల్‌వేర్‌ రహస్యంగా చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అత్యవసర, సంక్షోభ సమయాల్లో సైన్యానికి అవసరమైన సరఫరాల్లో అంతరాయం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది.  

టైం బాంబులాంటిదే 
మాల్‌వేర్‌ వ్యవహారం తొలుత ఈ ఏడాది మే నెలలో బయటపడింది. గువామ్‌లో అమెరికా ఎయిర్‌ బేస్‌కు చెందిన టెలికమ్యూనికేషన్స్‌ వ్యవస్థల్లో అనుమానాస్పద కంప్యూటర్‌ కోడ్‌ను తాము గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్‌ సంస్థ వెల్లడించింది. మరో కీలక ప్రాంతంలో ఉన్న కంప్యూటర్లలోనూ ఇది ఉన్నట్లు పేర్కొంది. ఓల్ట్‌ టైఫన్‌ అనే చైనా హ్యాకింగ్‌ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ పరికరాల్లో చైనా మాల్‌వేర్‌ అనేది నిజంగా టైంబాంబు లాంటిదేనని అమెరికా కాంగ్రెస్‌ అధికారి చెప్పారు.

సైనిక స్థావరాలకు విద్యుత్, నీటి సరఫరాను, సమాచార మారి్పడిని హఠాత్తుగా నిలిపివేయడానికి ఈ మాల్‌వేర్‌ను ఉపయోగిస్తుంటారని చెప్పారు. దీనివల్ల సైన్యంలో పనివేగం తగ్గిపోతుందని అన్నారు. కేవలం అమెరికాలోనే కాదు, విదేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లోని పరకరాల్లోకి చైనా హ్యాకర్లు మాల్‌వేర్‌ను పంపించినట్లు ప్రచారం సాగుతోంది. తైవాన్‌ విషయంలో ఇటీవలి కాలంలో చైనా దూకుడు పెంచింది. ఈ దేశంలో సమీపంలో తరచుగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. తమ దేశంలో తైవాన్‌ ఒక అంతర్భాగమని వాదిస్తోంది. మరోవైపు తైవాన్‌కు అమెరికా అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ పరికరాల్లోకి చైనా మాల్‌వేర్‌ ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement