అమెరికాలో పెంచిన పౌరసత్వ ఫీజులకు కోర్ట్‌ బ్రేక్‌

US Federal Judge Ordered Halt To Hefty Citizenship,Immigration fees - Sakshi

శాన్‌డియాగో: భారీగా పెంచిన పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ ఫీజులను నిలిపివేస్తూ అమెరికా ఫెడరల్‌ జడ్జి ఆదేశాలు జారీచేశారు. అక్టోబర్‌ 2 నుంచి అమలులోకి రావాల్సిన ఈ భారీ ఫీజులను యుఎస్‌ జిల్లా జడ్జి జఫ్రీ వైట్‌ తక్షణం నిలిపివేశారు. ఆ ఇద్దరూ సీనియర్‌ హోంసెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు మెక్‌ అలీనన్, చాద్‌వూల్ఫ్‌లను చట్టవిరుద్ధంగా నియమించారని జడ్జి అభిప్రాయపడ్డారు. ఫెడరల్‌ నియమం ప్రకారం ఈ ఫీజులను ఎందుకు పెంచారో వివరించడంలో ట్రంప్‌ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఫీజుల పెంపును అడ్డుకున్నానని జడ్జి తెలిపారు. 8 స్వచ్ఛంద సంస్థలు, ఇమ్మిగ్రెంట్‌ లీగల్‌ రీసోర్స్‌ సెంటర్‌లు ఉమ్మడిగా పెంచిన ఫీజులను వ్యతిరేకిస్తూ కోర్టుని ఆశ్రయించారు. పెంచిన ఫీజులను, చట్ట విరుద్ధంగా నియమితులైన అధికారులు నిర్ణయించారు కనుక వీటిని తక్షణం నిలిపివేయాలని ఈ సంస్థలు కోర్టుని కోరడంతో, ఫెడరల్‌ జడ్జి ఈ తీర్పునిచ్చారు.

జార్జ్‌ డబ్లు్య బుష్‌ అధ్యక్షునిగా ఉన్న కాలంలో వైట్‌ను కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌ జడ్జిగా నియమించారు. ఈ నిర్ణయంపై హోంలాండ్‌ సెక్యూరిటీ, జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు స్పందించలేదు. చాద్‌వూల్ఫ్‌ని పాలసీ విభాగంలో ఉన్నతాధికారిగా ట్రంప్‌ నియమించినప్పటికీ, ఈ నియామకాన్ని సెనేట్‌ అంగీకరించలేదు. గ్రీన్‌కార్డులకు, పౌరసత్వ హక్కులకు తాత్కాలిక వర్క్‌ పర్మిట్‌లకు ఫీజులను 20 శాతం మేర పెంచారు. హెచ్‌1 బి వీసా ఫీజు ప్రస్తుతం ఉన్న 460 డాలర్ల నుంచి 555 డాలర్లకు పెంచారు. ఎల్‌ 1 వీసాల ఫీజులను 75 శాతం పెంచి, 805 డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పటికే పనిచేస్తోన్న హెచ్‌1బి కార్మికుల భాగస్వాములకు ఫీజుని 34 శాతం పెంచి, 550 డాలర్లు వర్క్‌ పర్మిట్‌ ఫీజుగా నిర్ణయించారు. పౌరసత్వ ఫీజుని 83 శాతం పెంచి, 640 డాలర్ల నుంచి 1170 డాలర్లుగా నిర్ణయించారు. ఫీజులు చెల్లించలేమని చెప్పిన వారికి, మినహాయింపులు ఇచ్చే పద్ధతికి కూడా స్వస్తి పలికేలా నిర్ణయం తీసుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top