
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక తగిలింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల చేరిక అంశంపై ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకుంటూ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అమెరికా ప్రభుత్వం నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు. దీంతో, ట్రంప్‌కు ఝలక్ ఇచ్చినట్టు అయ్యింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని టార్గెట్ చేశారు. వర్సిటీకి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి నిధుల్లో కోత వేసిన ట్రంప్ సర్కార్.. తాజాగా ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని గురువారం రద్దు చేసింది. దీంతో, ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్ ఫెడరల్ కోర్టులో యూనివర్సిటీ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా విచారణ జరిపిన న్యాయమూర్తి అలిసన్ బరోస్.. ట్రంప్ సర్కార్‌పై మండిపడ్డారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు.
తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్‌తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. ఎస్‌ఈవీపీ వ్యవస్థ నుంచి విశ్వవిద్యాలయాన్ని తొలగించడం అనైతికమని, నిబంధనలు ఉల్లంఘించడం అవతుందని హార్వర్డ్ తన తాజా పిటిషన్‌లో పేర్కొంది.
BREAKING: A federal judge has BLOCKED the Trump Administration’s illegal move to bar Harvard University from enrolling international students.
— Trump Lie Tracker (Commentary) (@MAGALieTracker) May 23, 2025
‘ఒక్క సంతకంతో యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో పావువంతు వారిని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని’ హార్వర్డ్ పేర్కొంది. 140కి పైగా దేశాల్లోని విద్యార్థులు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న, త్వరలో రాబోయే విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 7,000 మంది. ఈ మొత్తం సంఖ్య యూనివర్సిటీలో చదువుతున్న వారిలో 27 శాతానికి సమానం. తమకు వెంటనే ప్రభుత్వ చర్యల నుంచి ఉపశమనం కలిగించాలని హార్వర్డ్ తాజా పిటిషన్‌లో కోరింది.

వర్సిటీ మారాల్సిందే
ట్రంప్ సర్కారు నిర్ణయం హార్వర్డ్‌లో చదువుతున్న 10,158 మంది విదేశీ విద్యార్థులు, స్కాలర్ల భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది. వీరిలో 788 మంది భారతీయులున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పొందే విషయంలో ఇబ్బందులేమీ ఉండవు. కోర్సుల మధ్యలో ఉన్నవారు మాత్రం ఇతర వర్సిటీల్లోకి మారాల్సిందే. లేదంటే అమెరికాలో ఉండేందుకు చట్టపరమైన హోదా కోల్పోయి దేశ బహిష్కరణకు గురవుతారని నోయెమ్ స్పష్టం చేశారు.
విమర్శల వెల్లువ
హార్వర్డ్‌పై తాజా ఆంక్షలను వర్సిటీకి చెందిన దక్షిణాసియా విద్యార్థుల సంఘం (ఎస్‌ఏఏ)తో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు గమ్యంగా కొనసాగాలన్న ఆకాంక్ష అమెరికాకు బహుశా లేనట్టుగా ఉందని చైనా దుయ్యబట్టింది. హార్వర్డ్‌లో 1,203 మంది చైనా విద్యార్థులున్నారు. భారత విద్యార్థులపై ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్టు మన దౌత్య వర్గాలు తెలిపాయి. ప్రభావిత విద్యార్థులను చేర్చుకునేందుకు హాంకాంగ్‌లోని అత్యున్నత వర్సిటీలు ముందుకొచ్చాయి. వారికి అన్నివిధాలా సాయమందిస్తామని ఎస్‌ఏఏ ప్రకటించింది.