మరోసారి మిసైళ్ల మోత.. ఇరాన్‌లోని కీలక స్థావరాలపై బాంబుల వర్షం | US conducts more strikes against Iran | Sakshi
Sakshi News home page

మరోసారి మిసైళ్ల మోత.. ఇరాన్‌లోని కీలక స్థావరాలపై బాంబుల వర్షం

Jun 28 2026 5:11 AM | Updated on Jun 28 2026 10:41 AM

US conducts more strikes against Iran

ఫ్లోరిడా: ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు చేసింది. ఆదివారం తెల్లవారుజామున మిసైళ్లతో విరుచుకుపడింది. ఎం/వి ఎవర్ లవ్లీ వాణిజ్య సరుకు రవాణా నౌకపై ఇరాన్ దాడికి ప్రతిగా శుక్రవారం అర్ధరాత్రి దాటాక అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశాన్ని ఇరాన్‌కు అమెరికా ఇచ్చింది. 

అయితే, ఇరాన్ దాన్ని లెక్క చేయకుండా డ్రోన్‌ను ప్రయోగించి ఎం/టి కికు నౌకను ఢీకొట్టింది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఆ ట్యాంకర్, 2 మిలియన్లకు పైగా బ్యారెళ్ల ముడి చమురుతో హార్మూజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఓ ప్రకటనలో తెలిపింది.

ఏయే ప్రాంతాల్లో దాడులు? 
వాణిజ్య నౌకలపై ఇరాన్ కొనసాగిస్తున్న దూకుడుకు నేరుగా ప్రతిగా సెంట్కామ్ దళాలు దాడులు చేపట్టాయి. అమెరికా సైనిక విమానాలు ఇరాన్ సైనిక నిఘా వ్యవస్థలు, సమాచార ప్రసార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్‌లేయర్‌ కెపాబిలటీస్‌ లక్ష్యంగా దాడులు చేశాయి. కాగా, హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, అమెరికా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని సెంట్కామ్ తెలిపింది. 

మా సహనం నశించింది: ఇరాన్‌ 
ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రాహీం అల్‌ఫిఖర్ ఎక్స్‌లో వరుస పోస్టులు చేశారు. "మీరు మా సార్వభౌమాధికారంపై దాడి చేశారు. ఇక పరిస్థితుల్ని మార్చే కార్యాచరణకు సిద్ధంగా ఉండండి. మీరు తప్పుగా అంచనా వేశారు. మా సహనం నశించింది. కాళరాత్రిని చూడడానికి సిద్ధంగా ఉండండి. మీరు అన్ని హద్దులు దాటారు. మా నిర్ణయం మాటలకే పరిమితం కాదు.. కొన్ని గంటల్లో మా శక్తిని చూపిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇరాన్ సైన్యంలోని అత్యున్నత ఉమ్మడి యుద్ధ కమాండ్‌కు చెందిన అధికార ప్రతినిధి. 

మరోవైపు, బహ్రెయిన్ శనివారం ఇరాన్ తమ భూభాగంపై పలు డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించింది. ఈ దాడి తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని, శాంతిని కాపాడే ప్రయత్నాలకు ముప్పు తెచ్చిందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement