ఉక్రెయిన్‌ యుద్ధం.. చర్చల్లో పురోగతి 

Ukraine Russia Peace Talks Kick Off In Istanbul Erdogan Urges End To Tragedy - Sakshi

అణ్వస్త్రరహిత దేశంగా, తటస్థంగా ఉండేందుకు ఉక్రెయిన్‌ ఒప్పుకుంది: రష్యా 

బదులుగా భద్రతా హామీలపై ఏకాభిప్రాయం! 

ఒప్పంద తయారీ దిశగా పరిణామాలు 

కీవ్, చెహిర్నివ్‌ నుంచి రష్యా సేనలు వెనక్కు 

ఇక విదేశాంగ మంత్రుల చర్చలు: టర్కీ 

త్వరలో పుతిన్, జెలెన్‌స్కీ భేటీ: ఉక్రెయిన్‌ 

కీవ్‌: ఉక్రెయిన్‌ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం లభించే సూచనలు కన్పిస్తున్నాయి. నెలకు పైగా సాగుతున్న యుద్ధానికి తెర దించేందుకు టర్కీ వేదికగా రష్యా, ఉక్రెయిన్‌ జరుపుతున్న తాజా చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి కన్పిస్తోంది. ఉక్రెయిన్‌కు విశ్వాసం కల్పించే చర్యల్లో భాగంగా రాజధాని కీవ్, చెహిర్నివ్‌ నగరాల నుంచి సైన్యాన్ని భారీగా ఉపసంహరిస్తున్నట్టు రష్యా మంగళవారం ప్రకటించింది.

వాటినుంచి రష్యా దళాలు వెనుదిరుగుతున్నాయని ఉక్రెయిన్‌ కూడా ధ్రువీకరించింది. అంతేగాక ఇరు దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్‌స్కీ ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చర్చల్లో పాల్గొంటున్న ఉక్రెయిన్‌ బృందం సభ్యుడొకరు వెల్లడించారు! టర్కీ విదేశాంగ మంత్రి మేవ్లట్‌ కౌసోగ్లు కూడా దీన్ని ధ్రువీకరించారు. చర్చలు అర్థవంతంగా సాగాయని, పలు అంశాలపై ఇరు పక్షాలకు ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. వీటికి కొనసాగింపుగా త్వరలో రష్యా, ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రులు భేటీ అవుతారన్నారు. 

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య గతంలో బెలారస్‌ తదితర చోట్ల జరిగిన నాలుగైదు రౌండ్ల చర్చల్లో పెద్దగా ఏమీ తేలకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు వారాల పై చిలుకు విరామం తర్వాత ఇరు దేశాల బృందాలు తాజాగా మంగళవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో సమావేశమయ్యాయి. ఇరు దేశాల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించాయి. చర్చల నేపథ్యంలో పరస్పర విశ్వాస కల్పన ప్రయత్నాల్లో భాగంగానే సైన్యాన్ని వెనక్కు రప్పించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్‌ ఫోమిన్‌ చెప్పారు.

భవిష్యత్తులో ఏవైపూ మొగ్గకుండా తటస్థంగా ఉంటామని, అణ్వస్త్రరహిత దేశంగా కొనసాగుతామని చర్చల్లో ఉక్రెయిన్‌ ప్రతిపాదించిందని ఫోమిన్‌ చెప్పారు. బదులుగా ఆ దేశానికి ఇవ్వాల్సిన భద్రతా హామీలపై కూడా ఏకాభిప్రాయం కుదిరేలా కన్పిస్తోందన్నారు. ఆ మేరకు ఒప్పంద రూపకల్పన దిశగా చర్చలు సాగాయని వివరించారు. తటస్థంగా ఉండాలంటే రష్యాతో పాటు అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, టర్కీ, చైనా, పోలండ్, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు తమకు భద్రతా హామీ ఇవ్వాలని ఉక్రెయిన్‌ బృందం ప్రతిపాదించినట్టు సమాచారం.

సదరు హామీ ‘ఒక్కరిపై దాడి, అందరిపైనా దాడి’ అన్న నాటో సూత్రం మాదిరిగా ఉండాలని కోరిందంటున్నారు. 2014లో రష్యా ఆక్రమించిన క్రిమియా ద్వీపకల్పం హోదాపై 15 ఏళ్ల సంప్రదింపుల అవధి ఉండాలని ఉక్రెయిన్‌ ప్రతిపాదించింది. వీటిపై రష్యా స్పందన తెలియాల్సి ఉంది. అయితే చర్చలు అర్థవంతంగా సాగాయని రష్యా బృందం కూడా సంతృప్తి వెలిబుచ్చింది.

ఉక్రెయిన్‌ ప్రతిపాదనలను సమీక్షించి పుతిన్‌కు నివేదిస్తానని రష్యా బృందంలోని కీలక సభ్యుడు వ్లాదిమిర్‌ మెడిన్‌స్కీ తెలిపారు. అధ్యక్షుల స్థాయి చర్చలకు ఈ మాత్రం పురోగతి చాలని ఉక్రెయిన్‌ బృంద సభ్యుడు డేవిడ్‌ అర్కామియా అన్నారు. చర్చల వేదిక వద్ద పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన రష్యా కుబేరుడు, చెల్సియా ఫుట్‌బాల్‌ క్లబ్‌ యజమాని రోమన్‌ అబ్రమోవిచ్‌ ప్రత్యక్షమయ్యారు! ఇరు దేశాల అంగీకారంతోనే చర్చల్లో ఆయన అనధికారిక మధ్యవర్తిగా ఉన్నారని పుతిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ చెప్పారు. 

యథాతథంగా కొనసాగుతున్న దాడులు 
ఓవైపు చర్చలు జరుగుతుండగా∙పశ్చిమ, దక్షిణ ఉక్రెయిన్లో పలు ప్రాంతాలపై రష్యా దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. పశ్చిమ ప్రాంతంలోని ఓ ఇంధనాగారంపై భారీగా క్షిపణి దాడులు జరిగాయి.  దక్షిణాదిన రేవు పట్టణం మైకోలేవ్‌లో 9 అంతస్తుల పాలనా భవనంపై క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇందులో ఏడుగురిదాకా మరణించారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.

ఉద్యోగులు భవనంలోకి వెళ్లేదాకా ఆగి మరీ దాడికి దిగి పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రష్యా దళాలను తమ సైన్యాలు అద్భుతంగా తిప్పికొడుతున్నాయన్నారు. కీవ్‌ శివార్లలోని కీలకమైన ఇర్పిన్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 60కిపైగా మతపరమైన కట్టడాలను రష్యా నేలమట్టం చేసిందని ఉక్రెయిన్‌ పేర్కొంది. తమకు పూర్తిస్థాయిలో సాయం చేసేందుకు వెనకాడుతున్న పశ్చిమ దేశాలు ఈ విధ్వంసానికి పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

సమీ సమీపంలోని ట్రోస్టియానెట్స్‌ నగరాన్ని ఉక్రెయిన్‌ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. రష్యా సైనికుల మృతదేహాలు, కాలిపోయిన రష్యా యుద్ధ ట్యాంకులు నగరంలో పర్యటించిన ఏపీ వార్తా సంస్థ సిబ్బందికి కన్పించాయి. రష్యా, బెలారస్‌ల్లో కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు ఆర్థిక సేవల సంస్థ బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని అణు వ్యవస్థల భద్రతను సమీక్షించేందుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చీఫ్‌ ఆ దేశంలో పర్యటించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top