నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బహిరంగ లేఖ రాశారు. యుద్ధాన్ని ముఖాముఖి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. అయితే అదే సమయంలో యుద్ధానికి పూర్తి బాధ్యత పుతిన్‌దేనని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ జెలెన్‌స్కీ రాసిన ఈ ఓపెన్ లెటర్ అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూన్ 4న విడుదల చేసిన ఈ లేఖలో ఆయన పుతిన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాటో, భౌగోళిక రాజకీయాలు, రష్యన్ భాష వంటి అంశాలను కారణాలుగా చూపుతున్నప్పటికీ, అసలు ఈ యుద్ధం పుతిన్ వ్యక్తిగత నిర్ణయమేనని పేర్కొన్నారు.
గత 26 ఏళ్లలో పుతిన్ పాలనలో రష్యా–ఉక్రెయిన్ సంబంధాలు పూర్తిగా మారిపోయాయని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వాణిజ్యం, పౌర సహకారం గురించి మాట్లాడుకునే దేశాలు ఇప్పుడు క్షిపణి దాడులు, మరణాలు, విధ్వంసం గురించే చర్చించాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రష్యాలో యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందని జెలెన్‌స్కీ అన్నారు.
పెరుగుతున్న ధరలు, ఇంధన కొరత, ఆంక్షలు, నిరంతర సైనిక నియామకాలతో సాధారణ రష్యన్లు అసంతృప్తికి గురవుతున్నారని పేర్కొన్నారు. యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా రాజకీయ, ఆర్థిక వనరులు క్రమంగా బలహీనపడుతున్నాయని కూడా వ్యాఖ్యానించారు. యుద్ధభూమిలో రష్యా భారీ నష్టాలు చవిచూస్తోందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
మే నెలలోనే 30 వేల మందికిపైగా రష్యన్ సైనికులు మరణించారని లేదా తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. ముఖ్యంగా డోనెట్స్క్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలన్న రష్యా లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదని, ఈ ఏడాది కూడా అది సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, ఉక్రెయిన్ త్వరగా కుప్పకూలిపోతుందని భావించిన రష్యా అంచనాలు తప్పాయని జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్ ప్రజల ప్రతిఘటనతో పాటు అమెరికా, యూరప్ దేశాల మద్దతు తమకు బలంగా నిలిచిందన్నారు. "మాకు మద్దతు వస్తోంది.. మీకు ఆంక్షలు వస్తున్నాయి" అంటూ పుతిన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అంతర్జాతీయంగా రష్యా ఒంటరి అవుతోందని కూడా జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉత్తర కొరియా సహాయం కోరిన తొలి రష్యా పాలకుడు పుతిన్ అని పేర్కొంటూ, ప్రస్తుతం చైనాపై కూడా రష్యా అధికంగా ఆధారపడుతోందన్నారు. రష్యాకు పరోక్షంగా సహకరిస్తున్న దేశాలు కూడా యుద్ధంపై విసుగు చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇంత విమర్శల మధ్యలోనే జెలెన్‌స్కీ శాంతి ప్రతిపాదనను ముందుంచారు.
స్విట్జర్లాండ్, టర్కీ లేదా ఏదైనా అరబ్ దేశంలో పుతిన్‌తో ముఖాముఖి సమావేశానికి సిద్ధమని ప్రకటించారు. దేశాల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు నాయకులే తీసుకోవాలని, అందుకే ప్రత్యక్ష చర్చలు అవసరమని పేర్కొన్నారు. ఈ చర్చల సమయంలో పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే ఇరు దేశాల యుద్ధ ఖైదీలను పూర్తిగా పరస్పరం విడుదల చేసుకోవడం, యుద్ధ సమయంలో తరలించిన పౌరులు, పిల్లలను తిరిగి పంపించడం వంటి చర్యలను ప్రతిపాదించారు.
అమెరికా, యూరప్ దేశాలు కూడా శాంతి ప్రక్రియలో భాగస్వాములు కావాలని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భద్రతా హామీలు, కొత్త ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు పాశ్చాత్య దేశాల పాత్ర కీలకమని అన్నారు. చివరగా పుతిన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. "ఈ యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందని మీరు స్వయంగా నిర్ణయించుకోకపోతే.. ఉక్రెయిన్ తన ఉనికి కోసం పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ యుద్ధాన్ని ఆపగల శక్తి మీ చేతుల్లోనే ఉంది" అంటూ తన లేఖను ముగించారు. ఈ బహిరంగ లేఖ రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త మలుపుకు సంకేతమా? లేక మరో రాజకీయ ఒత్తిడి వ్యూహమా? అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
కీలకాంశాలు:
🔹 పుతిన్‌కు జెలెన్‌స్కీ బహిరంగ లేఖ.. ప్రత్యక్ష చర్చలకు ఆహ్వానం.
🔹 యుద్ధానికి పూర్తి బాధ్యత పుతిన్‌దేనని తీవ్ర విమర్శలు.
🔹 రష్యా భారీ సైనిక, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటోందని వ్యాఖ్య.
🔹 స్విట్జర్లాండ్ లేదా టర్కీలో ముఖాముఖి భేటీకి సిద్ధమన్న జెలెన్‌స్కీ.
🔹 చర్చల సమయంలో కాల్పుల విరమణ, ఖైదీల మార్పిడికి ప్రతిపాదన.
🔹 చర్చలు విఫలమైతే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక.


