Ukraine Crisis: యుద్ధం వేళ కీలక పరిణామం

Ukraine Civilians Evacuated From Mariupol - Sakshi

కీవ్‌/ఖర్కీవ్‌/లివీవ్‌: ఉక్రెయిన్‌ కీలక నగరం మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్‌ స్టీల్‌ప్లాంట్‌లో తలదాచుకుంటున్న పౌరుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్నాళ్లూ సరిపడా ఆహారం, నీరు అందక క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన సాధారణ పౌరులు బతుకుజీవుడా అంటూ బయటపడుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి సవియానో అబ్రియూ ఆదివారం తెలిపారు. ఉక్రెయిన్, రష్యా అధికారులతోపాటు రెడ్‌క్రాస్‌ ఇంటర్నేషనల్‌ కమిటీతో కలిసి ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు.

పరిస్థితి కొంత సంక్లిష్టంగానే ఉందని, ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని వ్యాఖ్యానించారు. స్టీల్‌ ప్లాంట్‌లో దాదాపు 1,000 మంది పౌరులు, 2,000 మంది ఉక్రెయిన్‌ సైనికులు ఉన్నట్లు అంచనా. ఈ స్టీల్‌ప్లాంట్‌ మినహా మారియూపోల్‌ ఇప్పటికే రష్యా వశమైంది. తమ దేశంలో వేలాది టన్నుల తిండిగింజల నిల్వలను రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నారని ఉక్రెయిన్‌ వ్యవసాయ శాఖ ఉపమంత్రి టారస్‌ వైసోట్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌లో పెద్ద నగరమైన ఒడెసాలోని ఎయిర్‌పోర్టుపై రష్యా సైన్యం రాకెట్‌ దాడికి పాల్పడింది.

దీంతో రన్‌వే చాలావరకు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. రాజధాని కీవ్‌ శివారులోని బుచా పట్టణ సమీపంలో ఉన్న అడవిలో ఖననం చేసిన ముగ్గురు పురుషుల మృతదేహాలను ఉక్రెయిన్‌ సైనికులు గుర్తించారు. రష్యా సైనికులు వారిని చిత్రహింసలు పెట్టి, కాల్చి చంపినట్లు అనుమానిస్తున్నారు. బుచాలో వందలాది మంది పౌరులను రష్యా పొట్టనపెట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌–రష్యా మధ్య దాదాపు ప్రతిరోజూ చర్చలు జరుగుతున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదని అన్నారు. 

- ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంత పట్టణమైన పొపాస్నా నుంచి ప్రజలను బయటకు తరలించేందుకు పంపించిన రెండు బస్సులపై రష్యా జవాన్లు కాల్పులు జరిపారని స్థానిక మేయర్‌ నికొలాయ్‌ ఖనటోవ్‌ వెల్లడించారు.

- యుద్ధం వల్ల స్వదేశానికి వచ్చిన తమ దౌత్య సిబ్బంది త్వరలో ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్తారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు. ఆయన ఆదివారం ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిత్రో కులెబాతో మాట్లాడారు. ఫిబ్రవరిలో రష్యా దాడులు ప్రారంభం కావడానికంటే ముందే ఉక్రెయిన్‌లోని అమెరికా దౌత్య సిబ్బంది స్వదేశానికి వెళ్లిపోయారు. 

- ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌ నగరంలో రష్యా కరెన్సీ రూబుల్‌ను అతిత్వరలో ప్రవేశపెట్టేందుకు పుతిన్‌ అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించినట్లు బ్రిటీష్‌ సైన్యం వెల్లడించింది. దీర్ఘకాలంలో ఇక్కడ రాజకీయంగా, ఆర్థికంగా ఆధిపత్యం చెలాయించాలన్న యోచన రష్యాకు ఉందని పేర్కొంది. ఖేర్సన్‌ సిటీని రష్యా ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. 

రష్యా చమురు డిపోలు ధ్వంసం!
ఉక్రెయిన్‌ ఎదురుదాడుల్లో రష్యా ఆయిల్‌ డిపోలు ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఇరుదేశాల సరిహద్దుల్లో ఉన్న రెండు డిపోలపై ఉక్రెయిన్‌ సైన్యం గత సోమవారం విరుచుకుపడింది. బాంబుల వర్షం కురిపించింది. బ్రియాన్‌స్క్‌లోని పలు చమురు ట్యాంక్‌లు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రష్యా భూభాగంలో బ్రియాన్‌స్క్‌ ఉంది. ఇక్కడి నుంచి పైప్‌లైన్‌ ద్వారా యూరప్‌ దేశాలకు ముడి చమురు ఎగుమతి అయ్యేది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top