బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ పోలీసు వ్యవస్థలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాల కాలం నాటి పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తూ నేషనల్ పోలీస్ సర్వీస్ (NPS) పేరుతో ఒక కొత్త విభాగాన్ని బ్రిటన్ సర్కార్ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్నిహోమ్ సెక్రటరీ షబానా మహమూద్ ఆదివారం ప్రకటించారు.
ప్రస్తుతం ఇంగ్లండ్ అండ్ వేల్స్ పోలీసు వ్యవస్థ 43 స్థానిక విభాగాలుగా విడిపోయి పనిచేస్తోంది. అయితే ఇప్పుడు ఈ మొత్తం విభాగాలు నేషనల్ పోలీస్ సర్వీస్ పరిధిలోకి రానున్నాయి. ఈ ఎన్‌పీస్‌ను అక్కడి మీడియా 'బ్రిటిష్ ఎఫ్‌బిఐ'గా అభివర్ణిస్తోంది.
"ఆన్‌లైన్ మోసాలు, అంతర్గత భద్రత, వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి అవసరమైన స్కిల్స్ కానీ, నిధులు కానీ చాలా స్థానిక పోలీసు విభాగాల వద్ద లేవు. ఇకపై నేషనల్ పోలీస్ సర్వీస్ విభాగం ఈ క్లిష్టమైన కేసులను చేధించనుంది" అని షబానా మహమూద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలు, ఆన్‌లైన్‌లో చిన్నపిల్లల లైంగిక వేధింపులు వంటి ఆంశాలపై ఈ "బ్రిటిష్ ఎఫ్‌బిఐ' దృష్టి సారించనుంది. ఈ నూతన సంస్కరణలకు సంబంధించిన బిల్‌ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.


