అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ జనవరి 19న భారత్‌లో అధికారిక పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, సాంకేతికత, ఆహార భద్రత, అలాగే ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరు నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
భారత్–యూఏఈ మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపునివ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం, పరస్పర పెట్టుబడులు, వాణిజ్య మార్పిడిలో గణనీయమైన వృద్ధి చోటుచేసుకుంటోంది.
గత 10 సంవత్సరాల కాలంలో భారతదేశానికి ఇది షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఐదో అధికారిక పర్యటన కాగా, అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత మూడోసారి భారత్‌కు రానున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేయనుంది.


