డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. అనేక అంతర్జాతీయ సంస్థలను తన ఆర్థిక, అంగ బలంతో గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు తానే అధ్యక్షుడిగా ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్‌కున్న తలబిరుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ సంస్థలన్నీ అమెరికా దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడతాయని అందుకే ఆ దేశం మాటే చెల్లాలని ఆయన తరచుగా వాదిస్తారు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితిపై కూడా ట్రంప్ పలుమార్లు విమర్శలు చేశారు. అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు నిధులు తగ్గించడంతో పాటు కొన్ని సంస్థలను బహిష్కరించారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ స్థాపించబోతున్నట్లు బ్లుూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. అందులో చేరే ప్రతి సభ్యదేశానికి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. పీస్ మిషన్ తీసుకునే ప్రతి నిర్ణయాలకు ఆ సంస్థ అధ్యక్షుడి నిర్ణయం తప్పనిసరై ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
అయితే ఏ దేశమయితే 1బిలియన్ డాలర్లు సంస్థకు విరాళంగా ఇస్తుందో ఆ దేశానికి సంస్థ యెుక్క శాశ్వత సభ్యత్యం లభిస్తుందని తెలిపింది. ఈ శాంతి ఆర్గనైజేషన్ యెుక్క ఉద్దేశం అంతర్జాతీయంగా శాంతిని సుస్థిరపరచడమేనని పేర్కొంది. అయితే ఈ శాంతిమిషన్‌లో చేరడానికి 1బిలియన్ డాలర్లు చెల్లించాలనే అనే వాదన పూర్తిగా అవాస్తవం అని వైట్‌హౌస్ తెలిపింది.


