చల్లారుతుందనుకున్న అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ట్రంపరితనంతో మళ్లీ మొదటికొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ వైపు భారీ నౌకాదళాన్ని పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైనిక చర్యకు దిగేదాకా పరిస్థితిని తెచ్చుకోవద్దంటూ ఇరాన్‌ను హెచ్చరించారాయన. అయితే.. ఈ చర్యపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ ప్రకటించింది.
ఇరాన్ వైపు భారీగా అమెరికా నౌకాదళం వెళ్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు నాకు నివేదికలు అందిస్తున్నారు. పరిస్థితిని నేనే స్వయంగా సమీక్షిస్తున్నా. ఏం జరుగుతుందో చూడాలి. అయితే సైనిక చర్య జరగకూడదని ఆశిస్తున్నా. ఒకవేళ ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని గనుక కొనసాగిస్తే.. అమెరికా కచ్చితంగా కఠినంగా స్పందిస్తుంది అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇప్పటికే అమెరికా యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో పాటు డిస్ట్రాయర్లు, యుద్ధవిమానాలను మిడిల్‌ఈస్ట్‌కు తరలిస్తోంది. అదనపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ నిరసనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో వేలాది మంది మరణించినట్లు మానవహక్కుల సంస్థలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ లెక్కల ప్రకారం ఆ సంఖ్య వేలల్లోనే ఉంది. ఇరాన్ అధికారులు మాత్రం ఆ సంఖ్య 5,000 దాకా ఉండొచ్చని అంటున్నారు. మృతుల్లో వందలాది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వేల మంది నిరసనకారుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. వాళ్లలో కొందరిని దేశద్రోహం కింద ఉరి తీయాలనే ఆలోచనతో ఉన్నారు.
అయితే వాళ్లను ఉరి తీసే ప్రయత్నాలు చేస్తే.. ఇరాన్‌పై సైనిక చర్య చేపడతామని ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో.. తమ ఒత్తిడి కారణంగానే ఇరాన్ నిరసనకారులను ఉరి వేసే ప్రణాళికను రద్దు చేసిందని మొన్నీమధ్య ప్రకటించారు కూడా. ఈ నిర్ణయం కారణంగానే ఆ దేశంపై సైనిక చర్య విషయంలో తాను వెనక్కి తగ్గినట్లు చెప్పుకున్నారు కూడా. అయితే తాజాగా.. సుమారు 837 మందిని ఉరి తీయకుండా నేను కాపాడాను అంటూ ఆయన ప్రకటించారు.
‘అణు’ వార్నింగ్
దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే అమెరికా మళ్లీ చర్యలు తీసుకుంటుంది, కానీ పరిస్థితి శాంతియుతంగా ముగియాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉంటే.. ఐరాస విభాగం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) తన మార్గదర్శకాల ప్రకారం.. సాధారణంగా నెలకు ఓసారి ‘అణు తనిఖీ’ చేపట్టాలి. కానీ, గత ఏడు నెలలుగా ఇరాన్‌లోని యురేనియం నిల్వలను పరిశీలించలేదని సమాచారం. దీంతో అధిక స్థాయిలో ఉండొచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఖబడ్దార్..
అమెరికా బలగాల కదలికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. అమెరికా గనుక దాడి చేస్తే ప్రతిదాడి తప్పదు. ఇది బెదిరింపు కాదు, వాస్తవం. ఈసారి ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. అప్పుడు యుద్ధం దీర్ఘకాలం సాగుతూ మిడిల్‌ఈస్ట్ అంతా విస్తరిస్తుంది. అమెరికా బేస్‌లు ఉన్న దేశాలు జాగ్రత్త అంటూ పరోక్షంగా ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అయితే.. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరించే పరిస్థితి మీద మాత్రం ఆయన స్పందించలేదు.


