Afghanistan: అఖుండ్‌జాదా హతం.. బందీగా బరాదర్‌?!

Taliban leader Baradar Message after clash looked like hostage video - Sakshi

అఫ్గాన్‌లో హక్కానీలదే హవా 

పాక్‌ చేతికి పరోక్ష పాలన 

పాశ్చాత్య మీడియాలో కథనాలు

రెండు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే ఎవరైనా ప్రజల ముందు ప్రత్యక్షమవుతారు. కానీ అఫ్గాన్‌లో తాలిబన్ల అగ్రనాయకత్వం మాత్రం దేశం స్వాధీనమైనా బయటకు కనిపించకుండా రహస్యంగానే ఉంటోంది. ఇది వారి ప్రణాళికలో భాగమా? లేక దేశం వశమయ్యాక పరోక్ష శక్తులు తాలిబన్లను దెబ్బతీశాయా? అదే నిజమైతే తాలిబన్‌ అధినేతలు ఇకపై కనిపించరా? హక్కానీ నెట్‌వర్క్‌ చేతుల మీదుగా అఫ్గాన్‌ను పాక్‌ పాలిస్తుందా? అనే అంతుచిక్కని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వీటికి సమాధానాల కోసం అన్వేషిస్తున్న పాశ్చాత్య మీడియా తాజాగా విడుదల చేస్తున్న కథనాలపై అనుమానాలు నిజమవుతున్నాయనే చెబుతున్నాయి.

అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, తాలిబన్లు అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. దేశం స్వాధీనం కాగానే తాలిబన్లు తమ అగ్రనేతలతో కూడిన ప్రభుత్వాన్ని ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అఫ్గాన్‌లో పాగా వేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనకు తాలిబన్లు చాలా సమయం తీసుకున్నారు. చివరకు మల్లగుల్లాల అనంతరం ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. అయితే ఇందులో తాలిబన్లకు కాకుండా హక్కానీ నెట్‌వర్క్‌ నేతలకు పెద్దపీట వేయడం జరిగింది. దీంతో అఫ్గాన్‌ అంతర్గత పరిణామాలపై ప్రపంచ దేశాలు మరింత శ్రద్ధ పెట్టాయి. సదరు తాత్కాలిక ప్రభుత్వాన్ని అనేక దేశాలు గుర్తించలేదు.

ఒకపక్క ఇంత హడావుడి జరుగుతున్నా, తాలిబన్‌ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్‌జాదా మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. నిజానికి ఆయన నాయకత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనుకున్నారు. కానిపక్షంలో యూఎస్‌తో శాంతి చర్చల్లో కీలకపాత్ర పోషించిన బరాదర్‌ ప్రధాని అవుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా  పెద్దగా గుర్తింపులేని ముల్లా హసన్‌ను ప్రధానిగా ప్రకటించారు. దీంతో అసలు తాలిబన్‌ నేతలకు ఏమైందన్న ప్రశ్నలు ఉదయించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ద స్పెక్టేటర్‌ అనే పాశ్చాత్య మీడియాలో వెలువడిన కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి. బరాదర్‌ను బందీ చేసి ఉంటారని, అఖుండ్‌జాదా చనిపోయి ఉంటారని ఈ కథనం పేర్కొంది. గతంలో గార్డియన్‌ సైతం ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేసింది.  

కాబూల్‌ గొడవే కారణమా? 
ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాబూల్‌ అధ్యక్ష భవనంలో హక్కానీలకు, తాలిబన్లకు మధ్య గొడవ జరిగిందని, ఈ గొడవలో బరాదర్‌ తీవ్రంగా గాయపడ్డాడని కథనాలు వచ్చాయి. కానీ తాను బాగానే ఉన్నానంటూ బరాదర్‌ ఒక ఆడియో మెసేజ్‌ విడుదల చేశాడు. అనంతరం కొందరితో కలిసి ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. అయితే ఈ వీడియో చూస్తే అందులో బరాదర్‌ను బందీగా ఉంచినట్లు కనిపిస్తోందని మీడియా వర్గాలు అనుమానిస్తున్నాయి. సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు కోసం యత్నించడం, పంజ్‌షీర్‌పై శాంతియుత పరిష్కారాన్ని కోరడం వంటి బరాదర్‌ చర్యలు నచ్చని హక్కానీ నెట్‌వర్క్‌ ఆయనపై దాడి చేసి అనంతరం బంధించిందని కథనాలు వచ్చాయి. అదేవిధంగా తాలిబన్‌ అగ్రనేత అఖుండ్‌జాదాను హతమార్చిఉండొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. లేదంటే వీరిద్దరూ ఈపాటికి బయటి ప్రపంచానికి కనిపించేవారని, హక్కానీ నెట్‌వర్క్‌ వీరిని మాయం చేసిందని చాలామంది భావిస్తున్నట్లు స్పెక్టేటర్‌ కథనం పేర్కొంది.

గతంలో ముల్లా ఒమర్‌ 2013లో మరణిస్తే 2015వరకు బయటకు చెప్పని వైనాన్ని గుర్తు చేసింది. ఇదంతా పాక్‌ పరోక్షంగా ఆడిస్తున్న నాటకంగా విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలిపింది. తాలిబన్ల కన్నా తమకు అనుకూల హక్కానీ నెట్‌వర్క్‌ నేతల చేతిలో అఫ్గాన్‌ ప్రభుత్వం ఉండడం పాక్‌కు కావాలని, అందుకే ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనకు ముందు ఐఎస్‌ఐ చీఫ్‌ అఫ్గాన్‌కు వచ్చారని గుర్తు చేసింది. పాక్‌ కుయుక్తులు అర్థం చేసుకోకుండా తాలిబన్లు గుడ్డిగా నమ్మారని గత ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అమ్రుల్లా చాలాసార్లు విమర్శించారు. తాజా కథనాలు చూస్తే అదే నిజమైందని, పాక్‌ చేతికి అఫ్గాన్‌ పాలనా పగ్గాలు పరోక్షంగా వచ్చాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
– నేషనల్‌ డెస్క్, సాక్షి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top