
డమాస్కస్: సిరియా దక్షిణ ప్రాంతంలో గత కొంతకాలంగా జాతి ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంతలో ఇజ్రాయెల్.. ఇరాన్ రాజధాని డమాస్కస్‌లోని సిరియన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడి చేసింది. డ్రూజ్ కమ్యూనిటీ, సిరియన్ అధికారుల మధ్య తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరుణంలో ఈ దాడి జరిగింది. దీంతో ఇజ్రాయెల్- సిరియా మధ్య ఘర్షణలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సిరియాలో నివసిస్తున్న మైనారిటీ డ్రూజ్ కమ్యూనిటీని రక్షించేందుకే దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రభుత్వ దళాలు- సున్నీ బెడౌయిన్ తెగల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో డ్రూజ్ కమ్యూనిటీ విలవిలలాడుతోంది. సీఎన్‌ఎన్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు మరణించారు. 34 మంది గాయపడ్డారని సిరియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడికి ముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్.. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాతో.. డ్రూజ్ కమ్యూనిటీని విడిచిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.
సిరియాలోని స్వీడా ప్రావిన్స్‌లోని డ్రూజ్ కమ్యూనిటీ, సున్నీ బెడౌయిన్ తెగల మధ్య గత కొంతకాలంగా జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 248 మందికి పైగా జనం మరణించారు. వారిలో 92 మంది డ్రూజ్ కమ్యూనిటీకి చెందినవారు కావడం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే దక్షిణ సిరియా నుండి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. తరువాత ఇజ్రాయెల్ సైన్యం డమాస్కస్‌లోని గోలన్ హైట్స్ సరిహద్దులో అదనపు సైనిక మోహరింపును ప్రారంభించింది. ఈ పరిణామాల నేపధ్యంలో సిరియన్ ప్రభుత్వ అధికారులు వెనక్కి తగ్గి, డ్రూజ్ కమ్యూనిటీతో కాల్పుల విరమణ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రకటనను రాష్ట్ర వార్తా సంస్థ ‘సనా, డ్రూజ్ నేత సంయుక్తంగా ఒక వీడియో సందేశంలో వెల్లడించారు.