నాలుగు నెలలు తిరిగేసరికి.. ఆ దేశంలో కరువు కోరల్లోకి 60 లక్షల మంది!

Sudan Conflict: More than six million people one step away To famine - Sakshi

నాలుగు నెలలుగా యుద్ధ వాతావరణం. ఐదువేల మందికిపైగా మృతి. ప్రాణ భయంతో వలసలు పోయిన లక్షల మంది. కరువుకు కూతవేటు దూరంలో మరో అరవై లక్షల మంది. అంతర్యుద్ధంతో సూడాన్‌ ఎంతగా నాశనం అయ్యిందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు. 

సూడాన్‌లో పారామిలిటరీ ఫోర్స్‌, సైన్యం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అమాయకులు బలవుతున్నారు. ఆర్మీ జనరల్‌ అబ్దెల్‌ ఫట్టాహ్‌ అల్‌ బుర్హాన్‌, పారామిలిటరీ ర్యాపిడ్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ మొహమ్మద్‌ హందన్‌ దాగ్లో మధ్య విలీన చర్చలు విఫలం కావడంతో.. పరస్సర దాడులు కొనసాగుతున్నాయి.   ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి మొదలైన ఈ అంతర్యుద్ధంతో ఐదు వేల మందిదాకా మృతి చెందినట్లు పలు నివేదికలు చెబుతున్నారు. ఆ సంక్షోభాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. మూర్ఖంగా ముందుకే పోతున్నాయి రెండు వర్గాలు.

ఊహించని ప్రాణ నష్టం
చిన్నారులు ఈ స్థాయిలో మరణిస్తారని ఊహించలేదు. ఆకలి కేకల్ని నిర్మూలించగలిగే పరిస్థితులు ఉన్నా.. వాళ్‌లు చనిపోవడం బాధాకరం అని సేవ్‌ ది చిల్ట్రన్‌ అనే ఎన్జీవో ఒక ప్రకటన విడుదల చేసింది. మరణాలు మాత్రమే కాదు.. దాదాపు 40 వేల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, చికిత్స అందకపోతే వాళ్ల ప్రాణాలకు కూడా ముప్పేనని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 

సూడాన్‌ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్‌ గతంలోనే చెప్పింది. అంతర్యుద్ధంతో..  యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. మరోవైపు సూడాన్‌ నుంచి 44 లక్షల మంది సురక్షిత ప్రాంతాలు.. పొరుగు దేశాలకు తరలి వెళ్లి ఉంటారని యూఎన్‌వో శరణార్థి విభాగం అంచనా వేస్తోంది. సూడాన్‌లో కరువు కోరల్లో 60 లక్షల మంది ఉన్నారనే హెచ్చరికలూ జారీ అవుతున్నాయి. 

పరస్పర దాడుల వల్ల.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు.  చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకుపోయాయి. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారు. మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అయిపోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. అంతర్జాతీయంగా పలు ఛారిటీలు, సంస్థలు సాయం అందించేందుకు ముందుకు వెళ్తున్నా.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల దాడులతో వాటికి విఘాతం ఏర్పడుతోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top