
బెర్లిన్: జర్మనీలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. దేశంలోనే రెండో అతిపెద్ద హాంబర్గ్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించి 39 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
అప్పుడే వచ్చిన రైలు నుంచి ప్రయాణికులు దిగుతుండగా, కొందరు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈమె కత్తితో స్వైర విహారం చేసిందని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు జరుపుతున్నామని, ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని భావిస్తున్నామన్నారు. ఘటన నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడిచాయని, కొన్నిటిని దారి మళ్లించారని అధికారులు తెలిపారు. జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ఫిబ్రవరిలో జన సమూహంపైకి ఓ అఫ్గాన్ జాతీయుడు కారుతో దూసుకెళ్లగా 30 మంది గాయపడ్డారు.