నేరం మీది శిక్ష నాది.. సినిమాలో హీరోలా యువకుడి బిజినెస్‌.. పోలీసులను బురిడీ కొట్టించి..

Spanish Youth Unusual Business Like A Hero In The Movie - Sakshi

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో ఓ యువకుడు అసాధారణమైన ‘బిజినెస్‌’ చేస్తున్నాడు.. కొంత రుసుము తీసుకొని కోరుకున్న వారికి తన ‘సేవలు’ అందిస్తున్నాడు.. ఇంతకీ అతను అందిస్తున్న సేవలు ఏమిటో తెలుసా? సినిమాలో డబ్బు కోసం ఇతరుల నేరాలను తనపై వేసుకొని జైలుపాలయ్యే హీరో తరహాలో అతను వ్యవహరిస్తున్నాడు!! అంటే డ్రైవింగ్‌ తప్పిదాలకు పాల్పడే వ్యక్తుల నుంచి కాస్త ఫీజు వసూలు చేసి ఆ నేరాలను తనపై వేసుకుంటున్నాడు! తద్వారా వారి డ్రైవింగ్‌ లైసెన్సులతోపాటు డ్రైవింగ్‌ రికార్డులను పదిలంగా ఉంచుతూ తనపై మచ్చ వేసుకుంటున్నాడు! అలాగే వారిని ప్రభుత్వ జరిమానాల బారి నుంచి తప్పిస్తున్నాడు.

ఇలా ఇప్పటివరకు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 100 మంది వాహనదారుల నేరాలను తనపై వేసుకున్నాడు. ఇందుకోసం ‘ఖాతాదారుల’ నుంచి రూ. 6 వేల నుంచి రూ. 16 వేల వరకు వసూలు చేస్తున్నాడు. స్పెయిన్‌ మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం ఒక్కో వాహనదారుడికి లైసెన్స్‌ జారీ చేసే సమయంలో 12 పాయింట్లు కేటాయిస్తారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, సిగ్నల్‌ జంపింగ్, ఓవర్‌ స్పీడింగ్‌ తదితర నేరాలకు పాల్పడే వాహనదారుల నుంచి ట్రాఫిక్‌ పోలీసులు భారీ జరిమానాలు వసూలు చేయడంతోపాటు వారి నిర్ణీత పాయింట్లు కోల్పోగానే లైసెన్సులను సస్పెండ్‌ చేస్తారు.

ఈ నేపథ్యంలో వాహనదారులను కాపాడేందుకు ఆ యువకుడు నేరాన్ని తనపై వేసుకొని జరిమానాలు కడుతున్నాడట. ఇప్పటివరకు అతని డ్రైవింగ్‌ లైసెన్స్‌ కింద ఏకంగా మైనస్‌ 321 పాయింట్లు ఉండటం గమనార్హం. రెండేళ్లుగా పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఆ యువకుడు ఇటీవల మాత్రం దొరికిపోయాడట. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల కోసం ఓ ద్విచక్ర వాహనదారుడి వాహనాన్ని పోలీసులు ఆపబోగా అతను ఆపకుండా పరారయ్యాడు. కానీ మర్నాడే ఆ నేరాన్ని తానే చేశానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ యువకుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయగా అసలు బండారం బయటపడింది. దీంతో అతన్ని జైలుకు పంపారు.
చదవండి: మళ్లీ చూడాలంటే 107 ఏళ్లు ఆగాల్సిందే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top