చరిత్ర సృష్టించిన ఫాల్కన్ శ్రేణి రాకెట్
వాషింగ్టన్: ఆధునిక ప్రైవేట్ అంతరిక్ష రంగంలో తనను మించిన విశ్వసనీయ రాకెట్ మరోటి లేదని ఫాల్కన్–9 రాకెట్ నిరూపించుకుంది. అమెరికా స్థానికకాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ బేస్ ప్రయోగ కేంద్రం నుంచి ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఫాల్కన్–9 రకం రాకెట్‌ను ప్రయోగించడం ఇది 600వసారి.
దీంతో అధునిక అంతరిక్ష రంగంలో అత్యధిక సార్లు ఉపయోగించిన రాకెట్ రకంగా ‘ఫాల్కన్’ చరి త్రకెక్కింది. అమెరికా ప్రభుత్వ నేషనల్ రీకనా యిసెన్స్ ఆఫీస్(ఎన్‌ఆర్‌ఓఎల్)105 మిషన్‌లో భాగంగా ఈ రాకెట్‌ను స్పేస్‌లాంచ్ కాంప్లెక్స్–4ఈ నుంచి ప్రయోగించారు. అమెరికా నిఘా, సైనిక, పౌర అవసరాలు తీర్చే డజన్ల కొద్దీ కృత్రిమ ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్యలోకి ఎన్‌ఆర్‌ఓఎల్ మిషన్ ద్వారా నేషనల్ రీకనాయిసెన్స్ ఆఫీస్.. స్పేస్‌ఎక్స్ భాగస్వామ్యంతో నింగిలోకి
పంపిస్తోంది.
2010లో మొదలైన ప్రస్థానం
2010 జూన్ 4వ తేదీన తొలిసారిగా ఫాల్కన్ రకం రాకెట్‌లను ఉపయోగించారు. ఆరోజు డ్రాగన్ వ్యోమనౌకను ఇది తొలిసారిగా విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. ఫాల్కన్ రాకెట్లు ఏ మేరకు విజయవంతమవుతాయనే అనుమానాలు తొలినాళ్లలో ఉండేవి. ఆనాటి దశ నుంచి ప్రతి వారం ఒక ఫాల్కన్‌ను ప్రయోగించే విశ్వసనీయ దశకు ఫాల్కన్ రాకెట్లు చేరుకున్నాయి.
600వసారి వినియోగం అనే ఘటన కేవలం ప్రయోగంగా కాకుండా అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన సాంకేతిక సాధనంగా పరిణమించిందని సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఫాల్కన్ రాకెట్ల ప్రస్థానంలో 2015 ఏడాది అత్యంత కీలకఘట్టంగా చెప్పొచ్చు. ఆ ఏడాదిలో ఫాల్కన్‌ను తయారుచేసిన స్పేస్‌ఎక్స్ కంపెనీ ఆర్బిటల్–తరగతి బూస్టర్ సాయంతో రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించాక తిరిగి నిట్టనిలువుగా ల్యాండింగ్ చేసే సాహసం చేసింది.
ఆ తర్వాత కేవలం మూడేళ్లకే ఫాల్కన్ హెవీ రాకెట్ టెస్లా రోస్టర్‌ను నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. తర్వాత డెమో–2 మిషన్ ద్వారా 2020లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు వ్యోమగాములను తీసుకెళ్లిన తొలి ప్రభుత్వేతర సంస్థగా స్పేస్‌ఎక్స్ రికార్డులకెక్కింది. ఈ ప్రయోగానికి సైతం ఫాల్కన్ రాకెట్‌నే ఉపయోగించారు. దీంతో వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు చేర్చేందుకు విదేశీ రాకెట్లపై ఆధారపడే సంస్కృతికి చరమగీతం పాడిన ట్లయింది.
ఈ ఘటన తర్వాత క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ వంటి ప్రయోగాల్లో ఫాల్కన్–9 రాకెట్‌ల వినియోగం అనేది సర్వసాధా రణమైంది. దీంతో 2020 తర్వాతి నుంచి వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణాలకు ఫాల్కన్ వారి స్పేస్‌ఎక్స్ అనేది ప్రైమరీ ట్యాక్సీగా మారిపోయింది. ఆ తర్వాత ఫాల్కన్–9 విజయాల శాతం ఏకంగా 99 శాతం దాటడం విశేషం. దీంతో అత్యంత సురక్షితమైన అంతరిక్ష వాహకంగా ఫాల్కన్–9 చరిత్రలోనే తన పేరిట రికార్డ్‌ను లిఖించుకుంది.


