Space‌ Tourism: వినువీధిలో విహారయాత్రలు

Space‌ Tourism: Specialty And More Demand In International Market - Sakshi

వినువీధిలో విహారయాత్రల సందడి మొదలవుతోంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ ఇటీవల చేపట్టిన వ్యోమ విహారయాత్ర విజయవంతమైంది.మరికొన్ని సంస్థలు కూడా ఇదే బాటలో సన్నాహాలు చేసుకుంటున్నాయి.డబ్బు, ధైర్యం, దారుఢ్యం, ఆసక్తి ఉన్న పర్యాటకులను ఆకట్టుకునేందుకు టూరిజం ప్యాకేజీల రూపకల్పనపై కసరత్తులు చేసుకుంటున్నాయి.స్పేస్‌ టూరిజం సూపర్‌ లగ్జరీ పరిశ్రమగా ఎదిగే అవకాశాలపై అంతర్జాతీయ మార్కెట్‌ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్పేస్‌ టూరిజం కథా కమామిషు కాస్త తెలుసుకుందాం..

‘వర్జిన్‌ గ్రూప్‌’ అధినేత రిచర్డ్‌ బ్రాన్సన్‌ ఆధ్వర్యంలోని బ్రిటిష్‌ ప్రైవేటు సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌ ఇటీవల జరిపిన వ్యోమ విహారయాత్ర వార్తల్లో సందడి చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన వర్జిన్‌ గెలాక్టిక్‌ బృందంలో తెలుగు యువతి శిరీష బండ్ల ఉండటంతో ఈ సంఘటనకు మన జాతీయ మీడియాలో, మరీ ముఖ్యంగా మన తెలుగు మీడియాలో విపరీతమైన ప్రాచుర్యం లభించింది. ఒక పర్యాటక బృందం వినువీధిలో జరిపిన తొలి విహారయాత్ర ఇదే అయినా, అంతరిక్షానికి చేరుకున్న తొలి ప్రైవేటు సంస్థ మాత్రం వర్జిన్‌ గెలాక్టిక్‌ కాదు. అమెరికన్‌ సంస్థ ‘స్కేల్డ్‌ కాంపోజిట్స్‌’ తయారు చేసిన ‘స్పేస్‌వన్‌’ వ్యోమవిమానం పద్దెనిమిదేళ్ల కిందటే ఈ ఘనత సాధించింది. అయితే, అందులో పైలట్‌ తప్ప యాత్రికులెవరూ లేరు.

‘స్పేస్‌వన్‌’ వ్యోమవిమానంలో పైలట్‌ సహా ముగ్గురు ప్రయాణించేందుకు వీలు ఉన్నా, 2003 డిసెంబరు 17న పైలట్‌ బ్రియాన్‌ బిన్నీ ప్రయోగాత్మకంగా అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చాడు. ఆ తర్వాత ‘స్పేస్‌వన్‌’ 2004 సెప్టెంబరు–అక్టోబరులో రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు భూకక్ష్య నుంచి వందమీటర్ల ఎత్తుకు ప్రయాణించింది. ఈ రెండు యాత్రల్లో ఒకసారి మైక్‌ మెల్విల్, మరోసారి బ్రియాన్‌ బిన్నీ పైలట్లుగా ‘స్పేస్‌వన్‌’ విమానాన్ని అంతరిక్షం వరకు తీసుకుపోయి, అక్కడ చక్కర్లు కొట్టి విజయవంతంగా భూమ్మీదకు వచ్చారు. ఈ ఘనత సాధించినందుకు ‘స్కేల్డ్‌ కాంపోజిట్స్‌’ సంస్థ పది మిలియన్‌ డాలర్ల (రూ.74.45 కోట్లు) ‘ఎక్స్‌ ప్రైజ్‌’ గెలుచుకుంది. ‘స్పేస్‌వన్‌’ ప్రయోగాలు విజయవంతమైన తర్వాతి నుంచే స్పేస్‌టూరిజం దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 

రిచర్డ్‌ బ్రాన్సన్‌ బాటలోనే తాజాగా ‘అమెజాన్‌’ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ కూడా వ్యోమ విహారయాత్రకు సమాయత్తం అవుతున్నారు. బెజోస్‌ ఆధ్వర్యంలోని ‘బ్లూ ఆరిజిన్‌’ జూలై 20న చేపట్టనున్న ఈ యాత్రలో జెఫ్‌ బెజోస్, ఆయన సోదరుడు మార్క్, అమెరికన్‌ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ శిక్షణలో ఉత్తీర్ణులైన 13 మంది మహిళల్లో ఒకరైన వ్యాలీ ఫంక్‌తో పాటు ‘బ్లూ ఆరిజిన్‌’ తొలి వ్యోమయాత్రలో పాల్గొనేందుకు వేలంలో 28 మిలియన్‌ డాలర్లకు (రూ.208 కోట్లు) టికెట్టు దక్కించుకున్న ఒక అజ్ఞాత యాత్రికుడు కూడా పాల్గొననున్నారు. 

అపరకుబేరుడు ఎలాన్‌ మాస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌’ కూడా స్పేస్‌టూరిజం దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ‘స్పేస్‌ఎక్స్‌’ ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) విజయవంతంగా వ్యోమగాములను, కార్గోను చేరవేసింది. ఊరకే అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చేయడం కాకుండా, త్వరలోనే చంద్రుడి మీద విహారయాత్ర నిర్వహించేందుకు ‘స్పేస్‌ఎక్స్‌’ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సంస్థ 2023లో జపానీస్‌ శతకోటీశ్వరుడు యుసాకు మేజావాను చంద్రుడి మీదకు తీసుకువెళ్లనుంది. యుసాకుతో పాటు ఈ యాత్రలో మరో ఎనిమిది మంది ఔత్సాహిక యాత్రికులు కూడా పాల్గొననున్నారు.

ఇరవై ఏళ్ల కిందటే తొలి వ్యోమపర్యటన
స్పేస్‌ టూరిజం ఆలోచనలు గడచిన శతాబ్ది చివరినాళ్లలోనే మొదలయ్యాయి. ప్రైవేటు సంస్థలు ఈ దిశగా ప్రయత్నాలకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే సరిగా ఇరవయ్యేళ్ల కిందట– 2001 ఏప్రిల్‌ 28న అమెరికన్‌ వ్యాపారవేత్త డెన్నిస్‌ టిటో రష్యన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ‘సోయుజ్‌ టీఎం–32’ వ్యోమనౌకలో శాస్త్రవేత్తల బృందంతో కలసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) చేరుకుని, అక్కడ ఎనిమిది రోజులు గడిపి వచ్చి, ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యోమ పర్యాటకుడిగా రికార్డులకెక్కాడు. టిటో తన అంతరిక్ష ప్రయాణానికి 20 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.150 కోట్లు) చెల్లించాడు.

భూమ్మీదకు తిరిగి వచ్చాక ఈ పర్యటన తన కంపెనీకి, వ్యాపారానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పాడు. టిటో తర్వాత 2002లో దక్షిణాఫ్రికాకు చెందిన పారిశ్రామికవేత్త మార్క్‌ షటిల్‌వర్త్, 2005లో అమెరికన్‌ వ్యాపారవేత్త గ్రెగరీ ఆల్సెన్‌ కూడా డబ్బులు చెల్లించి ఐఎస్‌ఎస్‌ యాత్రకు వెళ్లి వచ్చారు. వీరి తర్వాత ఇరాన్‌లో జన్మించిన అమెరికన్‌ వ్యాపారవేత్త అనోషే అన్సారీ 2006లో డబ్బు చెల్లించి ఐఎస్‌ఎస్‌ యాత్రకు వెళ్లి వచ్చి, తొలి మహిళా అంతరిక్ష పర్యాటకు రాలిగా రికార్డులకె క్కారు. తర్వాత అమెరికన్‌ వాణిజ్యవేత్త చార్లెస్‌ సిమోన్యి 2007లో ఒకసారి, 2009లో ఒకసారి ఐఎస్‌ఎస్‌ యాత్రకు వెళ్లి వచ్చాడు.

అమెరికన్‌ వీడియో గేమ్‌ డెవలపర్‌ రిచర్డ్‌ గేరియట్‌ 2008లో ఐఎస్‌ఎస్‌ యాత్రకు వెళ్లి, అంతరిక్షయానం చేసిన రెండోతరం అమెరికన్‌గా రికార్డు సృష్టించాడు. రిచర్డ్‌ గేరియట్‌ తండ్రి ఆవెన్‌ గేరియట్‌ ‘నాసా’ తరఫున రెండుసార్లు అంతరిక్షయానం చేశాడు. రిచర్డ్‌ గేరియట్‌ తర్వాత కెనడియన్‌ వ్యాపారవేత్త గై లాలిబెర్టె 2009లో ఐఎస్‌ఎస్‌ యాత్రకు వెళ్లాడు. వీళ్లందరూ రష్యన్‌ ప్రభుత్వానికి చెందిన ‘సోయుజ్‌’ వ్యోమనౌకల్లోనే అంతరిక్ష పర్యటనలు చేశారు. ‘స్పేస్‌ అడ్వెంచర్స్‌’ కంపెనీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుని, ఈ యాత్రల్లో తన పర్యాటకులను ‘సోయుజ్‌’ ద్వారా అంతరిక్షానికి తీసుకువెళ్లింది. ‘స్పేస్‌వన్‌’ ప్రయోగం విజయవంతమైన దరిమిలా ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో దూసుకుపోవడానికి ముమ్మరంగా సన్నాహాలు మొదలుపెట్టాయి.

2021–2022 స్పేస్‌టూర్లు
ఈ ఏడాది ద్వితీయార్ధంలో, వచ్చే ఏడాది ప్రారంభంలో పర్యాటకులతో మరో నాలుగు స్పేస్‌టూర్లు నిర్వహించేందుకు అంతరిక్ష సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నాలుగు టూర్లు, వాటిలో పాల్గొనే వారి వివరాలు...
‘నాసా’ ఆధ్వర్యంలో చేపట్టిన ‘కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌’ (సీసీపీ) కింద ‘స్పేస్‌ఎక్స్‌’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్‌ రీసైలెన్స్‌’ ఈ ఏడాది సెప్టెంబరు 15న నలుగురు పర్యాటకులతో మూడురోజుల అంతరిక్ష యాత్ర చేపట్టనుంది. ఇది అంతరిక్షం చేరుకుని, భూమి చుట్టూ చక్కర్లు కొట్టి తిరిగి వస్తుంది. ఈ వ్యోమయాత్రలో అమెరికన్‌ వ్యాపారవేత్త జేర్డ్‌ ఇసాక్‌మెన్, కాలేజీ ప్రొఫెసర్‌ సియాన్‌ ప్రోక్టర్, పిల్లల ఆస్పత్రికి చెందిన పారామెడికల్‌ ఉద్యోగి హేలీ ఆర్సెనాక్స్, అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి క్రిస్టఫర్‌ సెంబ్రోస్కి పాల్గొననున్నారు.
► రష్యన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్‌’ ఈ ఏడాది ప్రైవేటు పర్యాటకులకు అవకాశం కల్పిస్తూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) రెండు యాత్రలు చేపట్టనుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 5, 16 తేదీలలో ‘సోయుజ్‌ ఎంఎస్‌–18, ఎంఎస్‌–19’ వ్యోమనౌకల ద్వారా చేపట్టనున్న 12 రోజుల యాత్రలో రష్యన్‌ సినీ దర్శకుడు క్లిమ్‌ షిపెంకో, రష్యన్‌ నటి యూలియా పెరెసిల్ద్‌ పాల్గొననున్నారు.
► ‘రాస్‌కాస్మోస్‌’ ఈ ఏడాది డిసెంబర్‌ 8, 19 తేదీలలో ఐఎస్‌ఎస్‌కు సోయుజ్‌–20 వ్యోమనౌక ద్వారా చేపట్టనున్న 12 రోజుల యాత్రలో జపానీస్‌ వ్యాపారవేత్త యుసాకు మేజావా, ఆయన సహాయకుడు యోజో హిరానో పాల్గొననున్నారు.
► ‘నాసా’ ఆధ్వర్యంలో ‘స్పేస్‌ఎక్స్‌’కు చెందిన  ‘క్రూ డ్రాగన్‌ రీసైలెన్స్‌’ వచ్చే ఏడాది జనవరిలో ఐఎస్‌ఎస్‌కు పదిరోజుల యాత్ర నిర్వహించనుంది. ఇందులో ఇజ్రాయెల్‌కు చెందిన మాజీ పైలట్, వ్యాపారవేత్త ఐటాన్‌ స్టిబ్బె, అమెరికన్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ల్యారీ కానర్, కెనడియన్‌ వ్యాపారవేత్త మార్క్‌ ప్యాథీ పాల్గొననున్నారు. ఈ యాత్రలో పాల్గొనే ఒక్కొక్కరి వద్ద 55 మిలియన్‌ డాలర్లు (రూ.410 కోట్లు) వసూలు చేస్తున్నట్లు ‘స్పేస్‌ఎక్స్‌’ ప్రకటించింది. ‘రాస్‌కాస్మోస్‌’ మాత్రం తన ధరలను అధికారికంగా ప్రకటించకపోయినా, ఇందుకోసం 30 మిలియన్‌ డాలర్లు (రూ.224 కోట్లు) వసూలు చేస్తున్నట్లు అనధికారిక వార్తలు వెలువడ్డాయి.

అమిత సంపన్నుల ఆటవిడుపు
ప్రస్తుతానికైతే ‘స్పేస్‌ టూరిజం’ అమిత సంపన్నుల ఆటవిడుపుగా మాత్రమే కనిపిస్తోంది. దండిగా డబ్బు, అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో గడపగలిగే శారీరక దారుఢ్యం, అక్కడి వరకు వెళ్ల గలిగే గుండెధైర్యం ఉంటే చాలు, ఎవ్వరైనా వెళ్లవచ్చు. ప్రపంచంలోని ధనిక, పేద దేశాల మధ్య అంతరాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో స్పేస్‌ టూరిజం పేరిట కొద్ది గంటలు లేదా కొద్ది రోజుల ఆనందం కోసం అమిత సంపన్నులు భారీ మొత్తంలో డబ్బు వృథాగా ఖర్చు చేయడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. శాస్త్ర పరిశోధనల కోసం, శాస్త్ర సాంకేతిక పురోగతి కోసం వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థలు జరిపే వ్యోమయాత్రలను అర్థం చేసుకోవచ్చు గాని, కేవలం పర్యటన కోసం అంతరిక్ష యాత్రల పేరిట డబ్బు ఖర్చు చేయడాన్ని సమర్థించలేమని పలువురు అంతర్జాతీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

‘అంతరాలు గల ప్రపంచంలో మనం ఉంటున్న నేపథ్యంలో నాకున్న సామాజిక అభిప్రాయాల ప్రకారం కేవలం కొద్దిమంది సంపన్నులకే పరిమితమయ్యే వ్యోమయాత్రలను సమర్థించలేను’ అని యూరోపియన్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడు గంటెర్‌ వెర్‌హ్యూజెన్‌ అభిప్రాయపడ్డారు. స్పేస్‌ టూరిజంపై విమర్శలు ఎలా ఉన్నా, ఇది శరవేగంగా ఎదుగుతున్న పరిశ్రమ అని, 2030 నాటికి 3 బిలియన్‌ డాలర్ల (రూ.22,360 కోట్లు) వార్షిక టర్నోవర్‌ సాధించగలదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ప్రచారానికి పుట్టుకొచ్చిన సంస్థలు
స్పేస్‌ టూరిజం మరింతగా పుంజుకునేలా ప్రచారం కల్పించేందుకు పలు సంస్థలు పుట్టుకొచ్చాయి. ‘స్పేస్‌ టూరిజం సొసైటీ’, ‘స్పేస్‌ ఫ్యూచర్‌’, ‘హాబీ స్పేస్‌’ వంటి సంస్థలు స్పేస్‌ టూరిస్టులుగా అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే వారి కోసం వివిధ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. స్పేస్‌ టూరిజం కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు సవివరమైన సమాచారాన్ని అందించేందుకు ‘యూని గెలాక్టిక్‌ స్పేస్‌ ట్రావెల్‌ మ్యాగజైన్‌’ అనే ద్వైమాసపత్రిక కూడా ప్రారంభమైంది.

‘జంక్‌’ జటిలం!
అంతరిక్ష విహారయాత్రలపై సామాజిక విమర్శలను పక్కనపెడితే, వీటిపై శాస్త్రవేత్తల బృందాల్లో మరో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే శాస్త్ర పరిశోధనల కోసం జరిపిన అంతరిక్ష యాత్రల కారణంగా పునర్వినియోగానికి పనికిరాని పరికరాల శకలాలు, అంతరిక్ష ప్రమాదాల కారణంగా ముక్క ముక్కలైన ఉపగ్రహాల శకలాలు, కాలం చెల్లిన ఉపగ్రహాలు, ఇతర వ్యర్థాలు అంతరిక్షంలో భారీగా పేరుకుపోయాయి. అంతరిక్ష ప్రయోగాలు పెరుగుతున్న కొద్దీ ఈ వ్యర్థాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యర్థాలనే ‘స్పేస్‌ జంక్‌’ అంటున్నారు. వీటిని అక్కడి నుంచి తొలగించడం లేదా, అక్కడికక్కడే నాశనం చేసేయడం వంటి చర్యలు చేపట్టేందుకు తగిన పరిజ్ఞానం, పద్ధతులు ఇంతవరకు అభివృద్ధి చెందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్ర సాంకేతిక ప్రయోజమేదీ లేకుండా, కేవలం సంపన్నుల వినోదం కోసం, విలాసం కోసం అంతరిక్ష యాత్రలు చేపడితే ‘స్పేస్‌ జంక్‌’ సమస్య మరింత జటిలం కాగలదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘స్పేస్‌ జంక్‌’లో దాదాపు 0.4–4 అంగుళాల పరిమాణంలో ఉన్న 5 లక్షలకు పైగా శకలాలు భూమికి దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ శకలాలు గంటకు దాదాపు 36 వేల కిలోమీటర్ల వేగంతో చక్కర్లు కొడుతుంటాయి. ఇంత శరవేగంగా చక్కర్లు కొట్టే ఈ శకలాలు పొరపాటున భూమిపై నుంచి కొత్తగా ప్రయోగించే ఉపగ్రహాలకు గాని, రాకెట్లకు గాని తాకితే పెనుప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతరిక్షంలో పేరుకున్న ‘స్పేస్‌ జంక్‌’ను అక్కడికక్కడే నాశనం చేసేందుకు జపానీస్‌ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’ ఒక ‘ఎలక్ట్రానిక్‌ స్పేస్‌ విప్‌’ (అంతరిక్ష కొరడా) రూపొందించి, దీని పనితీరుపై పరీక్షలు జరుపుతోంది. ‘స్పేస్‌ జంక్‌’ సమస్యకు సరైన పరిష్కారం ఇంకా లభించక ముందే స్పేస్‌ టూరిజం కోసం వాణిజ్య సంస్థలు పోటీ పడటం సరికాదని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

టూరిస్టులకు ‘నాసా’ అవకాశం
స్పేస్‌ టూరిజం దిశగా ప్రైవేటు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ కూడా తన అంతరిక్ష యాత్రలలో పర్యాటకులకు అవకాశం కల్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘నాసా’ ప్రైవేటు పర్యాటకులకు అవకాశం కల్పించనున్న తన ‘కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌’ (సీసీపీ) కింద ప్రత్యేకంగా రూపొందించిన ‘బోయింగ్‌ స్టార్‌లైనర్‌’ క్యాప్సూల్‌ ద్వారా యాత్రలు నిర్వహించనుంది. ‘బోయింగ్‌ స్టార్‌లైనర్‌’ జరిపే ఒక్కో అంతరిక్ష యాత్రలో ఒక్కో ప్రైవేటు పర్యాటకునికి మాత్రమే అవకాశం ఉంటుంది. దీనికి టికెట్‌ ధరను ఇంకా నిర్ణయించలేదు. ‘సోయుజ్‌’ ద్వారా అంతరిక్ష యాత్రలకు రష్యన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్‌’ వసూలు చేసే తాజా ధరను పరిగణనలోకి తీసుకుని, తమ ధరను నిర్ణయించనున్నట్లు ‘బోయింగ్‌’ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. 

చంద్రమండలానికి టికెట్‌ రూ.1,119 కోట్లు
‘స్పేస్‌ఎక్స్‌’ కంటే చాలా ముందుగానే అమెరికన్‌ స్పేస్‌ టూరిజం కంపెనీ ‘స్పేస్‌ అడ్వెంచర్స్‌’ 2005లో చంద్రమండలానికి యాత్రా ప్యాకేజీని ప్రకటించింది. దీనికి టికెట్‌ ధరను కళ్లు చెదిరే రీతిలో100 మిలియన్‌ డాలర్లుగా (రూ.745 కోట్లు) నిర్ణయించింది. ‘డీప్‌ స్పేస్‌ ఎక్స్‌పెడిషన్‌– ఆల్ఫా’ (డీఎస్‌ఈ–ఆల్ఫా) పేరిట ‘సోయుజ్‌’ వ్యోమనౌక ద్వారా చేపట్టనున్న ఈ యాత్రలో ఏకకాలంలో ఇద్దరు పర్యాటకులకు అవకాశం ఉంటుందని తెలిపింది. అమ్మకానికి పెట్టిన రెండు టికెట్లలో ఒక టికెట్‌ 150 మిలియన్‌ డాలర్లకు (రూ.1119 కోట్లు) అమ్ముడుపోయినట్లు 2011లో ‘స్పేస్‌ అడ్వెంచర్స్‌’ వ్యవస్థాపకుడు ఎరిక్‌ ఆండర్సన్‌ ప్రకటించారు.

ఐఎస్‌ఎస్‌ మీదుగా చంద్రమండలానికి సాగే ఈ యాత్ర 9–21 రోజులు సాగుతుందని వెల్లడించారు. తొలుత ఈ యాత్రను 2015లో నిర్వహించనున్నట్లు ప్రకటించినా, తర్వాత దీనిని 2018 నాటికి వాయిదా వేస్తున్నట్లు ‘స్పేస్‌ అడ్వెంచర్స్‌’ ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకు ఈ యాత్రను నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహించేదీ కూడా ఇంతవరకు స్పష్టతనివ్వలేదు. తాజా పరిస్థితులను గమనిస్తే, ‘స్పేస్‌ అడ్వెంచర్స్‌’ తన కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసుకున్నట్లే భావించవచ్చు. 

అంతరిక్ష యాత్రలపై టూరిస్టుల అభిరుచులు
పర్యాటకుల కోసం అంతరిక్ష విహారయాత్రలు నిర్వహించడానికి సిద్ధపడు తున్న సంస్థలు తమ వినియోగదారుల అభిరుచులపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నాయి. టూరిస్టుల అభిరుచులకు అనుగుణంగా తమ భవిష్యత్‌ ప్రణాళికలకు రూపకల్పన చేసుకుంటున్నాయి. ఒక ఆన్‌లైన్‌ సర్వే ప్రకారం స్పేస్‌ టూరిస్టుల అభిరుచులు ఇలా ఉన్నాయి:

► అంతరిక్షంలో రెండువారాలు లేదా అంతకంటే తక్కువ కాలం గడపాలనుకుంటున్న వారు– 70 % మంది
►  వ్యోమనౌకలో చక్కర్లు కొట్టడంతో సరిపెట్టుకోకుండా, స్పేస్‌వాక్‌ చేయాలనుకుంటున్న వారు– 88% మంది
►  స్పేస్‌వాక్‌ కోసం అవసరమైతే అదనంగా 50 % వరకు చెల్లించాలనుకుంటున్న వారు– 14% మంది
►  అంతరిక్ష యాత్రలో భాగంగా స్పేస్‌ స్టేషన్‌ లేదా హోటల్‌లో గడపాలనుకుంటున్న వారు– 21% మంది.

సొంత వాహనాలతో సిద్ధమవుతున్న ప్రైవేటు సంస్థలు
‘స్పేస్‌ అడ్వెంచర్స్‌’ గత ఇరవయ్యేళ్లుగా పర్యాటకుల కోసం అంతరిక్ష యాత్రలు నిర్వహించినా, ఆ సంస్థ ఇప్పటి వరకు సొంత వాహనాన్ని రూపొందించుకోలేకపోయింది. వర్జిన్‌ గెలాక్టిక్, స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్‌ వంటి సంస్థలు తమ తమ సొంత వాహనాలతో పర్యాటకుల కోసం అంతరిక్ష యాత్రలు నిర్వహించేందుకు పోటాపోటీగా ముందుకొస్తున్నాయి. 

► ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ టికెట్‌ ధర 2.50 లక్షల డాలర్లు (రూ.1.86 కోట్లు). ఇప్పటికే 58 దేశాలకు చెందిన ఆరువందల మంది ఈ టికెట్లు కొనుక్కుని, అంతరిక్షంలో చక్కర్లు కొట్టేందుకు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టికెట్లు కొనుక్కున్న వారిలో పోటీ సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’ అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా ఉండటం విశేషం.

► ‘బ్లూ ఆరిజిన్‌’ తన తొలి అంతరిక్ష యాత్ర కోసం వేలంలో టికెట్‌ను అమ్మినా, రెగ్యులర్‌ టూర్ల కోసం ఇంకా టికెట్‌ ధరను ప్రకటించలేదు. అయితే, ఈ ధర 2 లక్షల డాలర్ల (1.49 కోట్లు) వరకు ఉండవచ్చని ‘బ్లూ ఆరిజిన్‌’ ఉద్యోగి ఒకరు ‘రాయ్‌టర్స్‌’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

► ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’, ‘బ్లూ ఆరిజిన్‌’ సంస్థలు నిర్వహించే టూర్‌ ప్యాకేజీలు పర్యాటకులను అంతరిక్షంలో చక్కర్లు కొట్టించి, తిరిగి భూమ్మీదకు తేవడానికి మాత్రమే పరిమితమైతే, ‘స్పేస్‌ఎక్స్‌’ ఏకంగా ఐఎస్‌ఎస్‌లో ఎనిమిది రోజులు గడపడానికి వీలుగా పర్యాటకుల కోసం ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఒకేసారి నలుగురు పర్యాటకులు పాల్గొనేందుకు వీలుంటుంది. నలుగురికి కలిపి 55 మిలియన్‌ డాలర్లు (రూ.410) టికెట్‌ ధరగా నిర్ణయించింది. ‘స్పేస్‌ఎక్స్‌’ ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ‘డ్రాగన్‌2’ వ్యోమనౌకను రూపొందించుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది ఐఎస్‌ఎస్‌ యాత్రకు వెళ్లనుంది.

ఐఎస్‌ఎస్‌లో గడపడానికి సిద్ధపడిన పర్యాటకులకు తగిన శిక్షణ, ఐఎస్‌ఎస్‌లో వారు గడపడానికి అవసరమైన స్లీప్‌సూట్స్‌ వంటి సామగ్రి సరఫరా, ఆహార పానీయాలు, లైఫ్‌ సపోర్ట్, వైద్యసేవలు వంటివన్నీ కల్పిస్తుండటం వల్లనే స్పేస్‌ఎక్స్‌ తన టికెట్‌ ధరను భారీగానే నిర్ణయించింది. 

అంతరిక్షంలో ‘అరోరా’ హోటల్‌!
అమెరికాకు చెందిన ప్రైవేటు ఏరోస్పేస్‌ కంపెనీ ఆరియాన్‌ స్పాన్‌ ‘అరోరా స్పేస్‌ స్టేషన్‌’ పేరిట భూమి చుట్టూ పరిభ్రమించేలా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు 2018లో ప్రకటించింది. దీనిని సూపర్‌ లగ్జరీ హోటల్‌గా తీర్చిదిద్ది, అంతరిక్ష పర్యాటకులకు అత్యంత విలాసవంతమైన వినూత్నమైన అనుభూతిని అందించనున్నట్లు తెలిపింది. హూస్టన్‌లో దీని నిర్మాణం చేపట్టనున్నట్లు ‘ఆరియాన్‌ స్పాన్‌’ వ్యవస్థాపకుడు ఫ్రాంక్‌ బంగర్‌ ప్రకటించారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో ఇందులోకి పాసింజర్లను రిసీవ్‌ చేసుకోవడం ప్రారంభిస్తామని తెలిపారు. ఇందులో సిబ్బంది కాకుండా, మరో ఆరుగురు యాత్రికులు బస చేసేందుకు వీలుంటుంది. ఈ హోటల్‌లో గడపదలచిన వారు తప్పనిసరిగా మూడు నెలల శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. ఇందులో పన్నెండు రోజుల బస కోసం ప్రకటించిన టూర్‌ ప్యాకేజీ ధరను ‘ఆరియాన్‌ స్పాన్‌’ 9.5 మిలియన్‌ డాలర్లుగా (రూ.70.18 కోట్లు) నిర్ణయించింది. ‘అరోరా’ స్పేస్‌స్టేషన్‌ హోటల్‌లో ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇందులో బసచేసే యాత్రికులు యథేచ్ఛగా ఇందులో సంచరించవచ్చు.

దీనిలోని కిటికీల గుండా అంతరిక్షంలోని వింతలను, అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించవచ్చు. దీనిలోని హోలోగ్రామ్‌ డెక్‌పై ఆటలాడవచ్చు. అయితే, ఇది అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందా లేదా అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని నిర్మాణం ఇంతవరకు ప్రారంభం కాలేదని కథనాలు వెలువడ్డాయి. నిర్మాణ పనులను నిలిపివేసి, ఇప్పటి వరకు సేకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించేశామని ఆరియాన్‌ స్పాన్‌ సంస్థ వెబ్‌సైట్‌ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. అయితే, ఈ సంస్థ ప్రతినిధులు మాత్రం, వచ్చే ఏడాది పాసింజర్లను రిసీవ్‌ చేసుకుంటామని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top